Pakistan: పాకిస్థాన్ లో షుగర్ పేషెంట్ల పరిస్థితి దయనీయం

Pakistan hospitals running out of Insulin and Aspirin

  • పాకిస్థాన్ లో అంతకంతకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం
  • మరింత దిగజారిన ఆర్థిక పరిస్థితి
  • ఆసుపత్రుల్లో ఇన్సులిన్, ఆస్ప్రిన్ కు తీవ్ర కొరత

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలను చుట్టేస్తోంది. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఆహారం కూడా సరిగా లభించని రీతిలో పాక్ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని కథనాలు వస్తుండడం తెలిసిందే. ఇప్పుడు వైద్య రంగంపైనా పాక్ ద్రవ్యోల్బణం ప్రభావం తీవ్రస్థాయిలో పడినట్టు అర్థమవుతోంది. 

దేశంలోని చాలా ఆసుపత్రుల్లో ఇన్సులిన్, ఆస్ప్రిన్ వంటి ప్రాణాధార ఔషధాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. కొన్ని ఆసుపత్రుల్లో అత్యవసర ఔషధాలు లేని పరిస్థితి నెలకొంది. కనీసం ఇన్సులిన్ కూడా లేని పరిస్థితుల్లో షుగర్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి దయనీయంగా మారింది. 

విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలంటే ఏ దేశానికైనా విదేశీ మారకద్రవ్యం ఎంతో కీలకం. కానీ పాకిస్థాన్ వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు అడుగంటిపోయాయి. దాంతో విదేశాల నుంచి అత్యవసర ఔషధాలు దిగుమతి చేసుకోలేక పాక్ విలవిల్లాడుతోంది. 

ఇప్పటికే ఆర్థికభారం తీవ్రం కావడంతో స్థానిక ఫార్మా కంపెనీలు ఉత్పత్తిని బాగా తగ్గించివేశాయి. ఉన్న అరకొర మందుల రేట్లు కూడా మండిపోతున్నాయి. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం.... పాకిస్థాన్ లోని ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లలో ఉన్న మత్తుమందు నిల్వలు మరో రెండు వారాలకు మించి సరిపోవంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. క్యాన్సర్, కిడ్నీ, గుండె రోగుల శస్త్రచికిత్సలు నిలిచిపోవడమే కాదు, పాకిస్థాన్ ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం పొంచి ఉంది.

  • Loading...

More Telugu News