Google: ఇప్పుడు రోబోల మీద పడిన గూగుల్.. వాటికి కూడా లే ఆఫ్!

After human employees Google now lays off robots
  • ‘ఎవ్రీ డే రోబోట్స్’ ప్రాజెక్టును మూసేసిన గూగుల్
  • వివిధ ప్రాజెక్టులపై పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు ఔట్
  • ఈ ఏడాది మొదట్లో 1200 మంది ఉద్యోగులకు ఉద్వాసన
టెక్నాలజీ కంపెనీలన్నీ ఎడాపెడా ఉద్యోగులను తొలగిస్తున్న వేళ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల 1200 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ తాజాగా తమ ఫలహారశాలల్లో సేవలందిస్తున్న రోబోలకు కూడా లేఆఫ్ ప్రకటించింది. ఈ రోబోలు ప్రతి రోజూ గూగుల్ కెఫెటేరియన్ టేబుళ్లను శుభ్రం చేస్తూ ఉంటాయి. రోబోలను అభివృద్ధి చేయడం, కెఫెటేరియన్లను శుభ్రం చేయడంలో శిక్షణ ఇచ్చే ఎక్స్‌పెరిమెంటల్ విభాగం ‘ఎవ్రీ డే రోబోట్స్’ ప్రాజెక్టును ఆల్ఫాబెట్  మూసేసింది. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగానే దీనిని మూసివేసినట్టు తెలుస్తోంది. 

ఎవ్రీ డే రోబోట్స్ ప్రాజెక్టులో 200 మందికిపైగా ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. కాగా, ఈ రోబోలు ఫలహారశాలల్లోని చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయడం, తలుపులు తెరవడంతోపాటు ఇతర పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. కరోనా సమయంలో ఇవి విశేష సేవలు అందించాయి. కాన్ఫరెన్స్ రూముల్లోని టేబుళ్ల పరిశుభ్రతను పరీక్షించేందుకు కూడా వీటిని ఉపయోగించేవారు. అయితే, ఇప్పుడీ ‘ఎవ్రీ డే రోబోట్స్’ ప్రాజెక్టు లాభదాయకం కాదని భావించిన ఆల్ఫాబెట్ దానిని మూసివేసింది. కాగా, ఈ ఏడాది మొదట్లో 1200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు.
Google
Alphapet
Robots
Everyday Robots
Google Lay Offs

More Telugu News