Telangana: తెలంగాణ విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఫీజుల భారం
- ఆరు ఎంట్రన్స్ పరీక్షల ఫీజులు పెంచిన అధికారులు
- విద్యార్థులపై రూ.4.5 కోట్ల భారం పడనుందని అంచనా
- ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న విద్యాశాఖ
- ఈ నెల 28న ఎంసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఫీజుల భారం పెరిగింది. ఈ ఏడాది అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఫీజులు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ప్రతి పరీక్షకు రూ.100 మేర విద్యాశాఖ అధికారులు ఫీజులు పెంచేశారు. ఎంసెట్‌కు గతేడాది ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగ విద్యార్థులకు రూ.400 ఉంటే.. ఈ ఏడాది దానిని రూ.500 లకు, ఇతరులకు రూ.800 నుంచి రూ.900కు పెంచారు.
పీజీఈసెట్ రుసుము ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగ విద్యార్థులకు రూ.500, ఇతరులకు రూ.100 కాగా.. వీటిని వరుసగా రూ.600, రూ.1100లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎడ్‌సెట్, ఐసెట్, లాసెట్, పీఈసెట్, ఈసెట్‌లకూ ఫీజులు పెంచనున్నారు. ఈ ఆరు పరీక్షలకు పెంచిన ఫీజులతో విద్యార్థులపై రూ.4.5 కోట్ల భారం పడే అవకాశం ఉందని అంచనా.
తాజాగా తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 3 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు కూడా స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. చివరి తేదీని ఏప్రిల్ 10 గా ప్రకటించారు. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 12 నుండి 14వ తేదీవరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష జరగనుంది.