Preeti: గవర్నర్ తమిళిసైపై మెడికో ప్రీతి సోదరి ఆగ్రహం... స్పందించిన రాజ్ భవన్!

Medico Preeti sister fires on Governor Tamilisai
  • ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి
  • హైదరాబాదు నిమ్స్ లో చికిత్స
  • నిన్న పరామర్శించేందుకు వచ్చిన గవర్నర్
  • పూలదండతో వచ్చారంటూ ప్రీతి సోదరి వ్యాఖ్యలు
  • తన సోదరి చచ్చిపోయిందనుకున్నారా? అంటూ ఫైర్
కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించడం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే గవర్నర్ పర్యటనపై మెడికో ప్రీతి సోదరి తీవ్రస్థాయిలో స్పందించింది. గవర్నర్ తమిళిసై ఆసుపత్రికి వస్తూ పూలదండ తీసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. నా సోదరి చనిపోయిందనుకుని పూలదండ తీసుకువచ్చారా? అంటూ మండిపడింది. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగేనే వ్యవహరించేది? అని నిలదీసింది. 

ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే పూలదండలు వేసేసి వెళ్లిపోవడానికి వచ్చారా? అని ప్రీతి సోదరి ప్రశ్నించింది. మేం ఓదార్పును కోరుకోవడంలేదు, మాకు న్యాయం కావాలి అని డిమాండ్ చేసింది. 

దీనిపై రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి. గవర్నర్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆమె కారుపై పూలదండ ఉందని, అది ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించేందుకు ఉద్దేశించిన దండ అని స్పష్టం చేశాయి. దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఈ వైఖరి సరికాదని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రీతి కోలుకోవాలని గవర్నర్ ఆలయంలో ప్రార్థించారని వెల్లడించాయి.
Preeti
Medico
Suicide Attempt

More Telugu News