Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడంలేదు: సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala comments on Viveka case

  • వివేకా కేసులో కొందరిని టార్గెట్ చేస్తున్నారన్న సజ్జల 
  • వివేకా కుటుంబంలో విభేదాలున్నాయని వెల్లడి
  • కుటుంబ సభ్యులే వివేకాను ఏకాకిని చేశారని వ్యాఖ్యలు
  • జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆగ్రహం

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కీలకదశకు వచ్చిన తరుణంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడంలేదని ఆరోపించారు. కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారని తెలిపారు. 

వివేకా ఫోన్ లోని డేటా రికార్డులను ఎందుకు డిలీట్ చేశారని సజ్జల ప్రశ్నించారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ రికార్డులు ఎందుకు చూడలేదని నిలదీశారు. వివేకా కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. 

వివేకా హత్య కేసుతో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎలాంటి సంబంధంలేదని సజ్జల స్పష్టం చేశారు. వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాశ్ రెడ్డి వెళ్లారని వెల్లడించారు. ఈ కేసుతో అవినాశ్ రెడ్డికి సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.

ఈ వ్యవహారంలో బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలకు సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయని సజ్జల తెలిపారు. శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయాడని చెప్పినట్టు ఆదినారాయణరెడ్డి వెల్లడించాడని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వివేకా హత్య కేసు ద్వారా మా నాయకుడిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారు అని సజ్జల వివరించారు. 

వివేకాను కోల్పోవడం వైసీపీకి, జగన్ కు నష్టమేనని వ్యాఖ్యానించారు. వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే జగన్ మనస్ఫూర్తిగా ఆహ్వానించారని తెలిపారు. 

"వివేకా హత్యకు, రెండో పెళ్లికి సంబంధం ఉందని ఆంధ్రజ్యోతిలో వేశారు. కుటుంబ సభ్యులంతా కలిసి వివేకా చెక్ పవర్ తీసేశారని ఆంధ్రజ్యోతి చెప్పింది. కుటుంబ సభ్యులందరూ ఆయనను ఏకాకిని చేశారని కథనాలు వచ్చాయి. కొద్దిపాటి డబ్బు కోసం కూడా ఆయన ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అందులో వివరించారు" అని సజ్జల వెల్లడించారు. 

వివేకా చుట్టూ నేరప్రవృత్తి ఉన్న మనుషులు ఉన్నారని, వివేకా హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే అని స్పష్టం చేశారు. కుట్రదారుల గోల్ న్యాయం జరగాలని కాదని అన్నారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. వివేకాను చంపిన అసలు హంతకులను పట్టుకోవాలని సజ్జల డిమాండ్ చేశారు.

Sajjala Ramakrishna Reddy
YS Vivekananda Reddy
Jagan
YS Avinash Reddy
YSRCP
  • Loading...

More Telugu News