Ramcharan: హాలీవుడ్ సినిమాలు చేయాలని ఉంది: యూఎస్ లో ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Interview in ABC News with Will Reeve

  • భారతీయ సినిమాలు ఆస్కార్ స్థాయికి వస్తుండడం సంతోషంగా ఉందన్న చరణ్
  • నాటునాటు పాటకు ఆస్కార్ వస్తే భారతీయుడిగా గర్విస్తానని వ్యాఖ్య
  • సినిమాకు భాష ఉండదని రాజమౌళి చెపుతుంటారన్న చరణ్

హాలీవుడ్ ఇండస్ట్రీపై టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ సినిమాలను కూడా అంతే గొప్పగా స్వీకరించే హృదయం హాలీవుడ్ కు ఉందని ఆయన చెప్పారు. రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత ఏబీసీ న్యూస్ తరపున చరణ్ ను విల్ రీవ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

'ఆర్ఆర్ఆర్' కోసం తాము ఎంతో కష్టపడ్డామని చరణ్ చెప్పారు. నాటునాటు పాటను ఉక్రెయిన్ లోని అందమైన లొకేషన్లలో తీశామని... షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఒక టూరిస్ట్ గా మళ్లీ ఉక్రెయిన్ కు వెళ్లాలని అనుకున్నానని తెలిపారు. నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వస్తే ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడతానని చెప్పారు. ఆస్కార్ అవార్డుల స్థాయికి భారతీయ సినిమాలు వస్తుండటం సంతోషకరమని అన్నారు.

సినిమాకు భాష ఉండదని, కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయని... సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, డ్యాన్స్ చేయిస్తుంది, భయపెడుతుంది, ఇలా అన్నీ చేయిస్తుందని తమ దర్శకుడు రాజమౌళి చెపుతుంటారని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారతీయ సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా చూశారని చెప్పారు. తాను ఇండియాకు వెలుపల కూడా సినిమాలు చేయాలనుకుంటున్నానని, హాలీవుడ్ సినిమాలు చేయాలనే కోరిక కూడా ఉందని తెలిపారు.

Ramcharan
USA
ABC News
Will Reeve
Tollywood
Oscar

More Telugu News