Andhra Pradesh: ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం

Justice abdul nazeer takes oath as ap governor

  • జస్టిస్‌ నజీర్‌తో ప్రమాణం చేయించిన ఏపీ చీఫ్ జస్టిస్
  • కార్యక్రమానికి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరు
  • నూతన గవర్నర్‌కు పుష్ఫగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపిన సీఎం, చీఫ్ జస్టిస్

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ప్రమాణం చేయించారు. గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం..ముఖ్యమంత్రి జగన్, చీఫ్ జస్టిస్‌ మిశ్రా.. గవర్నర్‌ నజీర్‌కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. 

జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వస్థలం కర్ణాటకలోని మూడబిదరి తాలూకా బెలువాయి గ్రామం. 1958 జనవరి 5న ఆయన జన్మించారు. బాల్యం అంతా మూడబిదరిలోనే గడిచింది. స్థానిక మహావీర్ కళాశాలలో బీకాం చదివిన ఆయన ఆ తరువాత మంగళూరు కొడియాల్‌బెయిల్ ఎస్‌డీఎం లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 1983లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 2003లో తొలిసారిగా కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి ఏడాది హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017లో సుప్రీం కోర్టు జడ్జిగా నియమితులైన ఆయన ఈ ఏడాది జనవరి 4 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు. సుప్రీం జడ్జిగా పలు కీలక కేసుల్లో తీర్పులు వెలువరించారు.

  • Loading...

More Telugu News