BJP: మేయర్ పీఠం గెలుచుకున్న గంటల్లోనే ‘ఆప్’కు షాక్.. బీజేపీలో చేరిన కౌన్సిలర్ పవన్ షెరావత్

AAP councillor Pawan Sehrawat joins BJP
  • బీజేపీలో చేరిన వెంటనే ‘ఆప్’పై తీవ్ర విమర్శలు చేసిన కౌన్సిలర్
  • హౌస్‌లో గందరగోళం సృష్టించాలంటూ పార్టీ తనపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపణ
  • స్టాండింగ్ కమిటీ పోల్స్‌కు ముందు కాషాయ కండువా కప్పుకున్న పవన్ షెరావత్
ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించి, పలు అవాంతరాల తర్వాత మేయర్ పీఠం గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి అంతలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బావనా వార్డు కౌన్సిలర్ పవన్ షెరావత్ కొద్దిసేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. స్టాండింగ్ కమిటీ పోల్స్‌కు కొన్ని నిమిషాల ముందు ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం గమనార్హం. బీజేపీలో చేరిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ హౌస్‌లో గందరగోళం సృష్టించాలంటూ ఆప్ తనపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఆప్ రాజకీయాలు తనను ఉక్కిరిబిక్కిరి చేశాయని విమర్శించారు. 

కాగా, మొన్న రాత్రి 11 గంటలకు జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. వాటర్ బాటిళ్లు, పండ్లు విసురుకున్నారు. నిన్న తెల్లవారుజాము వరకు ఈ హైడ్రామా కొనసాగింది. కాగా, బుధవారం సాయంత్రం జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది.
BJP
AAP
Delhi
MCD
Pawan Sehrawat

More Telugu News