give 30 days paid marriage leave: కొత్త జంటలకు చైనాలో బంపరాఫర్
- కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లకు నెల రోజుల సెలవు, జీతం కూడా
- కొన్ని ప్రావిన్స్ లలో అమలు చేస్తున్నట్లు వెల్లడించిన ‘పీపుల్స్ డైలీ’ పత్రిక
- వివాహాలు, జననాల రేటు పెంచేందుకేనని వివరణ
చైనా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. గతంలో జనాభా నియంత్రణకు ‘వన్ చైల్డ్’ పాలసీని తీసుకొచ్చింది. దీంతో జననాల రేటు భారీగా పడిపోయింది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు చైనా దిగింది. పిల్లల్ని కనాలంటూ దేశ ప్రజలకు పిలుపునిస్తోంది. తాజాగా కొత్తగా పెళ్లయిన వారికి దేశంలోని కొన్ని ప్రావిన్స్ లలో ఓ ఆఫర్ ప్రకటిస్తున్నారు.
కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు 30 రోజుల సెలవు ఇస్తున్నారు. ఈ సెలవు దినాలకు జీతం కూడా చెల్లిస్తున్నారు. నిజానికి చైనాలో వివాహం చేసుకున్న వాళ్లకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా వెంటనే ఉద్యోగాల్లో తిరిగి చేరిపోవాల్సిన పరిస్థితి. దీంతో వివాహాలను, జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో గన్సు, షాంగ్జి తదితర ప్రావిన్స్ లలో కొత్త పాలసీని అమలు చేస్తున్నారు.
కొత్తగా పెళ్లయిన యువతీ యువకులకు 30 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన అధికారిక పత్రిక ‘పీపుల్స్ డైలీ’ తెలిపింది. ఫిబ్రవరి నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో నూతన జంటలు చాలా సంతోషపడుతున్నాయి. ఇంత బిజీ లైఫ్ లో నెల రోజుల సెలవు దొరుకుతోందని సంబరపడిపోతున్నాయి.