gold prices: ఈ ఏడాది బంగారం ధర ఇంకా పెరుగుతుందా? తగ్గుతుందా?

Will gold price touch all time high this year

  • బంగారం ధరలపై వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితుల ప్రభావం
  • మరికొంత శాతం పెరగొచ్చన్న అంచనాలు 
  • చైనా మార్కెట్ తెరుచుకోవడంతో ఆభరణాలకు డిమాండ్

బంగారం ధర 2022 అక్టోబర్ నుంచి చూస్తే, దేశీయంగా 10 గ్రాములకు 16 శాతం పెరిగి రూ.50,760 నుంచి రూ.58,800కు చేరుకుంది. దీనివల్ల బంగారంలో పెట్టుబడుల పట్ల మళ్లీ ఆసక్తి నెలకొంది. మరి ఈ ఏడాది బంగారం ఇంకా ర్యాలీ చేస్తుందా? 

అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయుల్లోనే ఉంది. ఆర్థిక సంక్షోభాలు, అనిశ్చితుల సమయాల్లో బంగారాన్ని రక్షణ సాధనంగా చూస్తుంటారు. దీంతో కరోనా మహమ్మారి సమయంలో బంగారం ర్యాలీని చూశాం, ఆ తర్వాత కొంత తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఇటీవల గరిష్ఠ స్థాయులకు చేరాయి. గతేడాది మార్చి నాటికి గరిష్ఠానికి చేరిన బంగారం ధరలు, అదే ఏడాది అక్టోబర్ నాటికి 22 శాతం తగ్గాయి. మధ్యలో రేట్లు తగ్గడానికి చైనాలో లాక్ డౌన్ లు, సెంట్రల్ బ్యాంకుల కఠినవైఖరి కారణమయ్యాయి. బంగారానికి అతిపెద్ద మార్కెట్లలో చైనా కూడా ఒకటి. అక్కడ లాక్ డౌన్ లతో ఆభరణాల డిమాండ్ తగ్గింది. కానీ, ఇప్పుడు చైనా లాక్ డౌన్ లు ఎత్తివేసింది.   

ఒకవైపు చైనా మార్కెట్ తిరిగి తెరుచుకోవడం, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇక పెరగదన్న అంచనాలు, దీంతో వడ్డీ రేట్లు ఇకమీదట పెద్దగా పెరగకపోవచ్చన్న అంచనాలు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరలను ఇక మీదట నడిపించనున్నాయి. మొత్తానికి బంగారం ధరలు మరికొంత పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ధరల పరంగా ఎంతో అనిశ్చితి నెలకొందని క్వాంటం ఏఎంసీ సీఐవో చిరాగ్ మెహతా అంటున్నారు. ఒక్కసారి ఫెడ్ రేట్ల పెంపు ముగింపునకు చేరితే (2023 మధ్య నాటికి) బంగారం ధరలపై సానుకూల ప్రభావం కనిపిస్తుందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికిప్పుడు రికవరీ కాకపోవచ్చన్న అంచనా మరికొందరిలో ఉంది. ఇది కూడా బంగారం ధరలకు మద్దతునిచ్చేదే. కనుక బంగారాన్ని దీర్ఘకాల పెట్టుబడుల కోసం తీసుకోవచ్చన్నది నిపుణుల సూచన.

  • Loading...

More Telugu News