USA: ఇంకోసారి ఇలా చేయొద్దు.. నిఘా బెలూన్లపై చైనాకు అమెరికా హెచ్చరిక

USA Never Again Warning To China In First Meet Since Spy Balloon

  • మ్యూనిచ్ కాన్ఫరెన్స్ లో చైనా దౌత్యవేత్త వాంగ్ యీతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భేటీ
  • బాధ్యతారాహిత్య చర్యలను పునరావ‌ృతం చేయొద్దన్న బ్లింకెన్
  • తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే చర్యలను సహించబోమని వార్నింగ్

అమెరికా గగనతలంపై చైనా నిఘా బెలూన్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బెలూన్లను అమెరికా కూల్చేయడం, చైనా తీవ్రంగా స్పందించడంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలో బాధ్యతారాహిత్య చర్యలను పునరావ‌ృతం చేయొద్దంటూ చైనాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. 

జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో చైనా దౌత్యవేత్త వాంగ్ యీ తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమావేశమయ్యారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే చర్యలను అమెరికా సహించబోదని స్పష్టం చేశారు.

‘‘అమెరికా గగనతలంలో నిఘా బెలూన్ల ద్వారా దేశ సార్వభౌమాధికారానికి వాటిల్లిన  ముప్పుపై, అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా చైనా వ్యవహరించడంపై వాంగ్ యీతో బ్లింకెన్ మాట్లాడారు. ఆలాంటి బాధ్యతారాహిత్య చర్య మరోసారి జరగకూడదని హెచ్చరించారు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు.

అమెరికా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే ఎలాంటి చర్యలను సహించబోమని బ్లింకెన్ స్పష్టం చేశారని తెలిపారు. ఉక్రెయిన్ పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యాకు సహకారం అందిస్తే ఎదురయ్యే చిక్కులు, పరిణామాల గురించి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. దాదాపు గంట పాటు చర్చలు జరిగినట్లు వివరించారు.

  • Loading...

More Telugu News