Turkey: టర్కీ భూకంపంలో ఘనా ఫుట్ బాల్ ప్లేయర్ దుర్మరణం
- ఇంటి శిథిలాల కింద క్రిస్టియన్ అట్సు మృతదేహం గుర్తింపు
- టర్కీ సదరన్ ప్రావిన్స్ హతేలో ఉంటున్న అట్సు
- సెప్టెంబర్ లో హతే స్పోర్ట్స్ క్లబ్ లో చేరిన అట్సు
పెను భూకంపం టర్కీని శ్మశానంగా మార్చింది. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 41 వేల మందికి పైగా మరణించారు. తాజాగా మరో విషాదకర వార్త వెలుగులోకి వచ్చింది. ఘనా దేశపు ఫుల్ బాలర్, న్యూక్యాజిల్ జట్టు మాజీ మిడ్ ఫీల్డర్ క్రిస్టియన్ అట్సు మృతదేహాన్ని గుర్తించారు. తాను నివసిస్తున్న ఇంటి శిథిలాల కింద ఆయన డెడ్ బాడీ కనిపించింది.
టర్కీ సదరన్ ప్రావిన్స్ హతేలో క్రిస్టియన్ అట్సు నివసిస్తున్నాడు. ఆయన మృతదేహాన్ని గుర్తించినట్టు ఆయన మేనేజర్ మురాత్ వెల్లడించాడు. శిథిలాల క్రింద డెడ్ బాడీని గుర్తించారని... ఆయన ఫోన్ కూడా దొరికిందని చెప్పారు. ఆయనకు చెందిన వస్తువులను వెలికి తీస్తున్నారని తెలిపాడు. గత సెప్టెంబర్ లోనే హతే స్పోర్ట్స్ క్లబ్ లో అట్సు చేరాడు. టర్కిష్ సూపర్ లీగ్ లో ఈ జట్టు ఆడుతుంది. ఇంతలోనే భూకంపానికి ఆయన బలికావడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.