Bruce willis: చికిత్స లేని వ్యాధి బారినపడ్డ హాలీవుడ్ దిగ్గజ నటుడు

Bruce Willis Diagnosed With Untreatable Dementia

  • ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధి బారినపడ్డ హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లిస్
  • ఇది చికిత్స లేని వ్యాధి అంటున్న వైద్యులు
  • ‘డై హార్డ్’ సినిమాలతో బ్రూస్‌కు ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్

హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రూస్ విల్లిస్(67).. చికిత్స లేని ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు. అనారోగ్య సమస్యలతో గతేడాదే ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. 

మెదడు కణాల్లో అసాధారణ రీతిలో ప్రోటీన్లు పేరుకుపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా మెదడులోని ఫ్రాంటల్, టెంపోరల్ భాగాలు క్రమంగా కుచించుకుపోవడం ప్రారంభిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ.. రోగి ప్రవర్తనలో మార్పులు రావడం, చిరాకు, కోపం, భాషాపరమైన సమస్యలు తలెత్తడం, నడకలో సమతౌల్యం కోల్పోవడం, ఇతర మానసిక సమస్యలు తలెత్తుతాయి. ‘‘ప్రస్తుతానికి బ్రూస్ బాగానే ఉన్నారు. భవిష్యత్తులోనూ అలాగే కొనసాగాలని ఆశిస్తున్నాం’’ అని బ్రూస్ కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. 

‘డై హార్డ్’ సినిమాలతో బ్రూస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. మూన్‌లైటింగ్ అనే టీవీ షో ద్వారా ఆయన తొలిసారి ప్రజల దృష్టిలో పడ్డారు. తన కెరీర్‌లో బ్రూస్ ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, రెండు ఎమ్మీ అవార్డులను గెలుపొందారు. కాగా.. బ్రూస్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పలువురు హాలీవుడ్ నటులు, మిత్రులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

  • Loading...

More Telugu News