Botsa Satyanarayana: మూడు రాజధానులే మా ప్రభుత్వ విధానం: బొత్స
- రాజధానిపై ప్రభుత్వ వైఖరి ఇదేనంటూ బొత్స వ్యాఖ్యలు
- అసెంబ్లీ సాక్షిగా ఇదే చెప్పామని వెల్లడి
- నాడు సీఎం జగన్, బుగ్గన చెప్పిదానికి తాము మద్దతిచ్చామని వివరణ
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజధానిపై ప్రభుత్వ వైఖరి ఇదేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమంటూ స్పష్టం చేశారు. ఈ విషయం అసెంబ్లీ సాక్షిగా చెప్పామని వెల్లడించారు. మా ముఖ్యమంత్రి జగన్, మా ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పారని బొత్స వివరించారు. దాన్ని తాము అందరం సమర్థించామని, ఇదే తమ ప్రభుత్వ విధానం అని, ఇందులో మరో వాదనకు తావులేదని అన్నారు.
అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని బొత్స వివరించారు. ఇది ప్రభుత్వ నిర్ణయం అని, ఇకపైనా ఇదే కొనసాగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక, చంద్రబాబు హోల్ సేల్ గా అవినీతి చేశాడు కాబట్టే ప్రజలు హోల్ సేల్ గా ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. హోల్ సేల్ ఎవరో, రిటైల్ ఎవరో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. లోకేశ్ పాదయాత్రను పట్టించుకోనవసరం లేదంటూ తేలిగ్గా తీసిపారేశారు.