Bihar: పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. బీహార్ లో మహిళకు కొద్దిలో తప్పిన ప్రమాదం

Train Passes Over Bihar Woman Who Fell On Tracks
  • పట్టాల మధ్య పడుకుండిపోయిన మహిళ
  • స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్న వైనం
  • బీహార్ లోని తనుకుప్ప రైల్వే స్టేషన్ లో ఘటన
స్టేషన్ లో గూడ్స్ రైలు ఆగడంతో ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది.. ఇంతలో రైలు కదలడంతో పట్టాల మధ్యలో పడుకుండిపోయింది. దీంతో ప్రమాదం తప్పి, స్వల్ప గాయాలతో ఆ మహిళ బయటపడింది. బీహార్ లోని గయ దగ్గర్లో తనుకుప్ప రైల్వేస్టేషన్ లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రైల్వే స్టేషన్ అధికారులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనుకుప్ప స్టేషన్ లో ఓ గూడ్స్ రైలు ఆగింది. ఫ్లాట్ ఫాంకు అవతలివైపు ఉన్న ప్యాసింజర్ రైలు ఎక్కేందుకు ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. గూడ్స్ బండి మధ్యలో నుంచి అవతలి వైపునకు వెళుతుండగా సడెన్ గా రైలు కదిలింది. రైలు మధ్యలో ఉండడంతో సదరు మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించింది.

బయటపడే సమయం లేకపోవడంతో అలాగే పట్టాల మధ్య పడుకుంది. రైలు వెళ్లిపోయాక ప్లాట్ ఫాం మీదున్న ఇతర ప్రయాణికులు పరుగున వెళ్లి ఆ మహిళను లేపారు. రైలు పైనుంచి వెళ్లడంతో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రమాదమేమీ లేదని తెలిపారు. కాగా, పట్టాలు దాటేందుకు ఇలా ప్రాణాలు పణంగా పెట్టొద్దని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.
Bihar
goods train
track
woman
accident

More Telugu News