Taj Mahal: దీన్ని ఎవరు డిజైన్ చేశారు?.. అప్పట్లో తాజ్ మహల్ ను చూసి ముషారఫ్ అడిగిన తొలి ప్రశ్న
- 2001లో ఆగ్రాకు వచ్చిన పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్
- తాజ్ మహల్ సందర్శనకు ఉత్తమ సమయం ఏదంటూ ఆరా
- ప్రేమకు ప్రసిద్ధి చెందిన మొఘల్ స్మారక చిహ్నమంటూ తన పుస్తకంలో కితాబు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆగ్రా సమ్మిట్ కోసం 2001లో మన దేశంలో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా తాజ్ మహల్ సందర్శనకు వెళ్లారు. కట్టడాన్ని చూసి మంత్రముగ్ధుడైన ముషారఫ్.. తాజ్ మహల్ ను ఎవరు డిజైన్ చేశారని అడిగారట. ఈ విషయాలను ఆర్కియాలజిస్ట్ కేకే ముహమ్మద్ గుర్తు చేసుకున్నారు.
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆగ్రా సర్కిల్ లో ముహమ్మద్ పని చేసే వారు. ముషారఫ్ పర్యటన సందర్భంగా ఆయనకు గైడ్ గా ముహమ్మద్ వ్యవహరించారు. ‘‘తాజ్ మహల్‌ను చూసిన క్షణంలోనే దానితో ఆయన ప్రేమలో పడ్డారు. వెంటనే ముషారఫ్ అడిగిన మొదటి ప్రశ్న ‘దీన్ని ఎవరు డిజైన్ చేశారు?' అని. షాజహాన్ పేరు నేను చెబుతానని ఆయన ఊహించి ఉండవచ్చు. ‘తాజ్ మహల్ డిజైనర్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన వ్యక్తి’ అని నేను బదులిచ్చాను’’ అని ముహమ్మద్ చెప్పుకొచ్చారు.
‘‘తర్వాత ‘తాజ్ మహల్ ను సందర్శించేందుకు ఉత్తమ సమయం ఏది?’ అని ముషారఫ్ అడిగారు. వర్షం పడబోతున్నప్పుడు, సూర్యాస్తమయం సమయంలో చూడటానికి చాలా బాగుంటుందని చెప్పా. ఆయన అక్కడ షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాలు గడపాల్సింది. గంట సేపు ఉన్నారు. అక్కడ ముషారఫ్ దంపతులు 5 నిమిషాలపాటు ఒంటరిగా గడిపారు’’ అని వివరించారు.
‘‘ఆగ్రా.. తాజ్ మహల్ ఉన్న ప్రదేశం. ప్రేమకు ప్రసిద్ధి చెందిన మొఘల్ స్మారక చిహ్నం తాజ్ మహల్. అద్భుత నిర్మాణం, సౌందర్యం కారణంగా ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటిగా నిలిచింది’’ అని గతంలో తన పుస్తకంలో ముషారఫ్ రాసుకొచ్చారు.