super drinks: పండ్ల రసాలు కాకుండా, ఈ జ్యూసెస్ తో మంచి ఆరోగ్యం
- ఉసిరి, అల్లం రసంతో మంచి ఫలితాలు
- శతావరి జ్యూస్ తో ఎన్నో లాభాలు
- వీట్ గ్రాస్ జ్యూస్ ను కూడా తీసుకోవచ్చు.
రోజువారీ మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందేలా చూసుకోవడం మన బాధ్యత. అప్పుడే ఆరోగ్యం దెబ్బతినదు. పోషకాల కోసం ఎన్నో రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పండ్ల రసాలు కాకుండా తీసుకోతగిన వేరే సహజ రసాలు కూడా ఉన్నాయి.
ఆమ్ల జింజెర్ జ్యూస్
ఉసిరి, అల్లంతో చేసిన జ్యూస్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులపై మన శరీరం సమర్థవంతంగా పోరాటం చేయగలదు. ఉసిరిలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. అల్లానికి యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఉన్నాయి. జీర్ణ సామర్థ్యాలను కూడా పెంచుతుంది. ఉసిరి, అల్లాన్ని నూరి వచ్చిన రసాన్ని లేదంటే మిక్సీలో వేసి రసం చేసుకోవాలి. ఒకటి రెండు చెంచాలు కప్పు నీటిలో కలుపుకుని తాగాలి.
శతావరి నీరు
మహిళల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యానికి శతావరి మేలు చేస్తుంది. తల్లిపాలను పెంచుతుంది. హార్మోన్ల సమతుల్యతకు సాయపడుతుంది. దీనిలోనూ యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలున్నాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఆస్థమా, బ్రాంకైటిస్ తదితర శ్వాస కోస వ్యాధులతో బాధపడే వారికి ఇది మంచి ఔషధం. అరకప్పు నీటిలో 3-5 గ్రాముల శతావరి వేర్లు వేసి కాచాలి. తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి.
సట్టు
దీన్ని బార్లీ లేదా శనగల నుంచి చేస్తారు. ప్రాంతాన్ని బట్టి దీని తయారీ మారిపోతుంది. ఉదాహరణకు ఒడిశాలో అయితే జీడిపప్పులు, బాదం పప్పులు, మిల్లెట్, బార్లీతో చేస్తారు. దీన్ని రోజూ తీసుకుంటే ప్రొటీన్ లోపం పోతుంది. అమైనో యాసిడ్స్ లభిస్తాయి. భోజనాల మధ్యలో తీసుకోవడం వల్ల రోజంతా హుషారుగా ఉంటారు. జీర్ణాశయ ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఐరన్, క్యాల్షియం, పొటాషియంను భర్తీ చేస్తుంది. వేయించిన రెండు చెంచాల శనగ పప్పు, ఒక టీస్పూన్ బెల్లం పౌడర్, గ్లాసు నీరు వీటన్నింటినీ కలిపి తాగాలి.
వీట్ గ్రాస్ జ్యూస్
గోధుమ గడ్డితో చేసే ఈ జ్యూస్ ను సైతం రోజూ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్, పీచు ఉంటాయి. గుండె, జీర్ణాశయ ఆరోగ్యానికి ఇది సాయపడుతుంది. కాలేయ కార్యకలాపాలు మెరుగుపడతాయి. అరకప్పు నీటిలో కొంత గోధుమ గడ్డి వేసి మిక్సీ, జ్యూసర్ లో వేసి రసంగా మారిన తర్వాత తాగాలి.