Josh Hazlewood: టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ
- భారత్, ఆసీస్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్
- ఫిబ్రవరి 9న తొలి టెస్టు ప్రారంభం
- ఎడమకాలి గాయంతో బాధపడుతున్న హేజిల్ వుడ్
- ఇప్పటికే తొలి టెస్టుకు దూరమైన స్టార్క్
- ఇద్దరు ప్రధాన పేసర్ల సేవలు కోల్పోయిన ఆసీస్
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టుల సిరీస్ ఈ నెల 9న ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందే ఆసీస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ మొదటి టెస్టుకు దూరం కాగా, ఇప్పుడు మరో పేసర్ జోష్ హేజిల్ వుడ్ కూడా అదే బాటలో నడిచాడు.
హేజిల్ వుడ్ ఎడమ కాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో నాగ్ పూర్ టెస్టులో ఆడేది అనుమానంగా మారింది. హేజిల్ వుడ్ కు విశ్రాంతినివ్వాలని ఆస్ట్రేలియా శిబిరం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాక్టీసు సెషన్లలోనూ ఈ పొడగరి పేస్ బౌలర్ పాల్గొనడంలేదు.
తన ఫిట్ నెస్ పై హేజిల్ వుడ్ స్పందిస్తూ, ఈ సిరీస్ కు ముందు తాను మంచి రిథమ్ తో బౌలింగ్ చేశానని, అయితే గాయం నుంచి ఇంకా కోలుకోవాల్సి ఉందని తెలిపాడు. మంగళవారం నుంచి ప్రాక్టీసు షురూ చేస్తానని వెల్లడించారు. ఇక, ఎడమచేతివాటం పేసర్ మిచెల్ స్టార్క్ రెండో టెస్టు నాటికి సిద్ధమవుతాడని ఆసీస్ శిబిరం ఆశిస్తోంది.