Raghunandan Rao: తెలంగాణ డీజీపీని వెంటనే ఏపీకి పంపించేయాలి: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
- ఇటీవల తెలంగాణలో 93 మంది ఐపీఎస్ ల బదిలీ
- బీహార్ కు చెందినవారికి కీలక పోస్టులు ఇచ్చారన్న రఘునందన్ రావు
- తెలంగాణ ఐపీఎస్ లకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్ కు చెందినవారని, ఆయనను వెంటనే ఏపీకి పంపించేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తద్వారా ఇతర ఐపీఎస్ లకు న్యాయం చేయాలని అన్నారు.
ఇటీవల 93 మంది ఐపీఎస్ ల బదిలీలు జరిగితే, బీహార్ కు చెందిన నలుగురు ఐపీఎస్ లను కీలక పోస్టుల్లో నియమించారని అన్నారు. అంజనీకుమార్ (డీజీపీ), స్వాతి లక్రా (ఎస్పీఎఫ్), షానవాజ్ ఖాసిమ్ (ఐజీ), సంజయ్ కుమార్ జైన్ (లా అండ్ ఆర్డర్) బీహార్ కు చెందినవారని, తెలంగాణలో కీలక పదవుల్లో కొనసాగుతున్నారని రఘునందన్ రావు వివరించారు. ఈ బదిలీలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసినట్టుగా ఉందని అన్నారు.
ఈ బదిలీల్లో తెలంగాణకు చెందిన ఐపీఎస్ లకు అన్యాయం జరిగిందని భావిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఐపీఎస్ లకు ఒక్క మంచి పోస్టు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీహార్ కు చెందినవారికి పెద్దపీట వేయడం చూస్తుంటే సీఎం కేసీఆర్ మూలాలు బీహార్ లో ఉన్నాయేమోనన్న సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు.