Sundeep Kishan: మూవీ రివ్యూ : 'మైఖేల్'

Michael Movie Review

  • సందీప్ కిషన్ హీరోగా రూపొందిన 'మైఖేల్'
  • వైవిధ్యానికి దూరంగా నడిచిన కథాకథనాలు
  • పాత్రలను సరిగ్గా డిజైన్ చేయడంలో విఫలమైన డైరెక్టర్  
  • బాణీల పరంగా చూసుకున్నా బలహీనమే
  • విజయ్ సేతుపతి - వరలక్ష్మి పాత్ర లేట్ ఎంట్రీ మరో మైనస్

సందీప్ కిషన్ విభిన్నమైన కథలతో .. పాత్రలతో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని కనబరచడానికి ట్రై చేస్తున్నాడు. అలా ఈ సారి ఆయన చేసిన సినిమానే 'మైఖేల్'. ఈ సినిమాలో పాత్ర కోసం ఆయన 20 కేజీల బరువు తగ్గాడంటే ఎంతగా కసరత్తు చేశాడనేది అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులకు కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 
 
1990 లలో జరిగే కథ ఇది. మైఖేల్ (సందీప్ కిషన్) పది .. పన్నెండేళ్ల వయసు నాటికే జీవితంలో ఎన్నో దెబ్బలు తినేసి ఉంటాడు. దాంతో ఆయనలో ఒక రకమైన తెగింపు చోటుచేసుకుంటుంది. తన తండ్రిని చంపాలనే ఆవేశంతో ఆ వయసులోనే ఆయన ముంబైకి చేరుకుంటాడు. అక్కడి మాఫియా సామ్రాజ్యాన్ని గురునాథ్ ( గౌతమ్ మీనన్) శాసిస్తుంటాడు. ఆయన భార్య చారుమతి (అనసూయ), కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్). ఆ ఇద్దరూ అంటే గురునాథ్ కి ప్రాణం. 

అలాంటి గురునాథ్ ప్రాణాలు కాపాడిన మైఖేల్ ఆయన బృందంలో చోటు దక్కించుకుని, ఆయనకు నమ్మకస్తుడిగా ఎదుగుతాడు. అయితే ఇది గురునాథ్ కొడుకైన అమర్ నాథ్ కి నచ్చదు. అలాగే తనని పక్కన పెడుతున్న తండ్రి తీరు కూడా అతనికి అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గురునాథ్ హత్యకి కుట్ర జరుగుతుంది. ఆ హత్యను ప్లాన్ చేసిన రతన్ (అనీష్ కురువిళ్ల)ను .. ఆయన కూతురు ధీర ( దివ్యాన్ష) ను అంతం చేయమని చెప్పి మైఖేల్ ను గురునాథ్ ఢిల్లీకి పంపిస్తాడు. 

అక్కడికి వెళ్లిన మైఖేల్ .. ధీర ప్రేమలో పడిపోయి వచ్చిన పని పక్కన పెడతాడు. అంతేకాదు ఆ సమయంలోనే జరిగిన ఒక అనూహ్యమైన సంఘటన కారణంగా మైఖేల్ నే అంతం చేయమని గురునాథ్ తన మనుషులను పురమాయిస్తాడు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? మైఖేల్ తండ్రి ఎవరు? .. ఆయనపై అతనికి గల కోపానికి కారణం ఏమిటి? మైఖేల్ జీవితంలోకి కన్నమ్మ దంపతులు (విజయ్ సేతుపతి - వరలక్ష్మి శరత్ కుమార్) ఎలా ఎంట్రీ ఇస్తారు? వంటి మలుపులతో కథ ముందుకు వెళుతుంది. 

రంజిత్ జయకోడి విషయానికొస్తే ఆయన తయారు చేసుకున్న కథాకథనాల్లో ఎక్కడా కొత్తదనం అనేది కనిపించదు. ప్రీ క్లైమాక్స్ వరకూ కూడా ఎలాంటి ట్విస్టులు లేకుండా కథ చాలా సాదాసీదాగా సాగుతూ ఉంటుంది. ఆయా ప్రధానమైన పాత్రలకు ఆయన నటీనటులను ఎంచుకున్న తీరు బాగుంది. అయితే సందీప్ కిషన్ పాత్రతో సహా, దివ్యాన్ష .. అనసూయ పాత్రలను ఆయన సరిగ్గా డిజైన్ చేయలేదు. ఆ పాత్రల నుంచి ఆడియన్స్ ఆశించే అవుట్ పుట్ రాదు.

ఇక విజయ్ సేతుపతి - వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలను డిజైన్ చేసిన తీరు ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే ఆ ఇద్దరి పాత్రల ఎంట్రీ చాలా లేటుగా జరుగుతుంది. ప్రీ క్లైమాక్స్ కి కాస్త ముందు వాళ్లు ఎంట్రీ ఇవ్వడం వలన, ఆ పాత్రలను ఎలివేట్ చేయడానికి తగినంత సమయం లేదు. ఇక ఉన్న సమయాన్నంతా యాక్షన్ కే ధారపోసి, ఎమోషన్ విషయం దగ్గరికి వచ్చేసరికి 'మమ' అనిపించడం కూడా అసంతృప్తిగానే అనిపిస్తుంది.

ఆర్టిస్టులంతా కూడా ఎవరిపాత్ర పరిధిలో వారు నటించారు. సందీప్ కిషన్ పాత్రకి పెద్దగా డైలాగ్స్ లేకుండా కొత్తగా చూపించడానికి ట్రై చేశారు. సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. యాక్షన్ సీన్స్ ను ఆయన నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. బాణీల విషయానికి వస్తే మాత్రం, 'నీవుంటే చాలు .. ' అనే పాట ఆకట్టుకుంటుంది. రోప్ ను ఉపయోగిస్తూ చేసిన కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొచ్చింది. కిరణ్ కౌషిక్ కెమెరా పనితనం ఫరవాలేదు. 

ఇక డైలాగ్స్ విషయానికొస్తే సందీప్ కిషన్ పాత్ర స్థాయిని దాటి .. ఆయనకి గల క్రేజ్ ను దాటి కొన్ని డైలాగులు ఉన్నాయి. బిల్డప్ కోసం రాసిన ఆ డైలాగులు కాస్త అతిగా అనిపిస్తాయి. 'గూట్లోనుంచి ఎగిరెళ్లిన పక్షి తిరిగొస్తుందిగానీ . పంజరంలో నుంచి వెళ్లిన పక్షి తిరిగిరాదు' అనేది ఈ సినిమా మొత్తానికి హైలైట్ డైలాగ్ గా చెప్పుకోవచ్చు. కొత్తదనం లేని కథాకథనాలు .. సరిగ్గా డిజైన్ చేయని ప్రధానమైన పాత్రలు .. విజయ్ సేతుపతి - వరలక్ష్మి శరత్ కుమార్ వంటి పవర్ ఫుల్ పాత్రల లేట్ ఎంట్రీ .. ఒకటికి మించి ఆకట్టుకోని పాటలు మైనస్ మార్కులను తెచ్చి పెడతాయి. మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రొటీన్ కి భిన్నంగా ఈ సినిమాలో ఏమీ జరగలేదనే చెప్పాలి.

Sundeep Kishan
Divyansha
Vijay Sethupathi
Varalakshmi Sharath Kumar
  • Loading...

More Telugu News