Mahesh Pithiya: అచ్చం అశ్విన్ లా బౌలింగ్ చేసే మహేశ్ తో ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రాక్టీస్
- భారత పర్యటనకు విచ్చేసిన ఆస్ట్రేలియా జట్టు
- టీమిండియాతో 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనున్న కంగారూలు
- ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు
- బెంగళూరులో ఆసీస్ జట్టు ప్రాక్టీస్
- అశ్విన్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆసీస్ ప్రణాళికలు
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో బలమైన జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా... భారత్ టూర్ కు సంసిద్ధమవుతోంది. ఫిబ్రవరి 9 నుంచి భారత్ లో ఆసీస్ పర్యటన షురూ అవుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ జట్టు టీమిండియాతో 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. భారత్ లో స్పిన్ పిచ్ లు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఆస్ట్రేలియా స్పిన్ ను ఎదుర్కొనేందుకు అన్ని వనరులు ఉపయోగించుకుంటోంది.
ఈ పర్యటనలో ప్రధానంగా రవిచంద్రన్ అశ్విన్ నుంచి ముప్పు ఉంటుందని గ్రహించిన కంగారూలు... అచ్చం అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేశ్ పితియాతో బంతులు వేయించుకుని స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ చేరుకుంది. బెంగళూరులో సాధన చేస్తున్న ఆసీస్ జట్టు తమ క్యాంప్ కు మహేశ్ పితియాను పిలిపించుకుంది.
మహేశ్ పితియా బరోడా జట్టుకు చెందిన ఆటగాడు. అశ్విన్ ను తలపించే బౌలింగ్ యాక్షన్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు మహేశ్ ను ఆస్ట్రేలియా జట్టు తమ నెట్ బౌలర్ గా ఎంచుకుంది. అతడి బౌలింగ్ లో సాధన చేయడం ద్వారా టెస్టుల్లో అశ్విన్ ను సమర్థంగా ఎదుర్కోవాలన్నది ఆసీస్ ప్రణాళిక.