Rahul Gandhi: ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్యలు ప్రమాదాలు మాత్రమే: ఉత్తరాఖండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Indira Gandhi and Rajiv Gandhi Killings Were Accidents Says Uttarakhand minister Ganesh Joshi

  • రాహుల్ తెలివితేటలను చూస్తుంటే జాలేస్తోందన్న మంత్రి
  • బలిదానానికి, ప్రమాదాలకు మధ్య వ్యత్యాసం ఉందన్న గణేశ్ జోషి
  • రాహుల్ యాత్ర జమ్మూకశ్మీర్‌లో సజావుగా ముగియడం వెనక ఘనత మోదీదేనని కితాబు

భారత మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదని, ఇందిర, రాజీవ్ హత్యలు ప్రమాదాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తెలివితేటలు చూస్తుంటే జాలేస్తోందన్న ఆయన.. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో భగత్‌సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్‌ వంటివారి బలిదానాలు జరిగాయని అన్నారు. గాంధీ కుటుంబ సభ్యుల హత్యలు ప్రమాదాలు మాత్రమేనని అన్నారు. ప్రమాదాలకు, బలిదానాలకు మధ్య వ్యత్యాసం ఉందని గణేశ్ జోషి వివరించారు. 

శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగంపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానమిచ్చారు. ఒకరు తమ తెలివితేటల స్థాయిని బట్టి మాత్రమే మాట్లాడగలరని రాహుల్‌ను మంత్రి ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ యాత్ర సజావుగా ముగియడం ప్రధాని మోదీ ఘనతేనని కితాబునిచ్చారు.  

ఆర్టికల్ 370ని కనుక ప్రధాని మోదీ రద్దు చేయకపోయి ఉంటే జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఉండేవే కావని, అప్పుడు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో రాహుల్ జాతీయ పతాకాన్ని ఎగరవేయగలిగి ఉండేవారే కాదని మంత్రి అన్నారు. జమ్మూకశ్మీర్‌లో హింస తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు బీజేపీ నేత మురళీమనోహర్ జోషి లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరవేశారని మంత్రి గుర్తు చేశారు.  

భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యల గురించి తనకు ఫోన్‌ ద్వారా తెలియజేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. హింసను ప్రేరేపించేవారు ఆ బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. హింసను ప్రేరేపించే మోదీ, అమిత్ షా, బీజేపీ, ఆరెస్సెస్ లాంటి వాళ్లకు ఆ బాధ ఎప్పటికీ అర్థం కాదని రాహుల్ అన్నారు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తి కుటుంబానికి, పుల్వామా దాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబానికి ఆ బాధ అర్థమవుతుందని అన్నారు. ఫోన్ కాల్ అందుకున్న కశ్మీరీలకు మాత్రమే ఆ బాధ అర్థమవుతుందని రాహుల్ అన్నారు.

  • Loading...

More Telugu News