Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అర్జంట్ అప్ డేట్
- పాత వెర్షన్ లో లోపాలు ఉన్నాయన్న కేంద్ర ప్రభుత్వం
- వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచన
- హ్యాకర్ల బారినపడే అవకాశం ఉందని వెల్లడి
ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన సెర్చింజన్ గూగుల్ క్రోమ్. అయితే, ఇప్పటికీ క్రోమ్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న వారు తక్షణమే అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా) అప్రమత్తం చేసింది.
గూగుల్ క్రోమ్ 109.0.5414.119 (ఆపిల్/లినక్స్).... 109.0.514.119/120 (విండోస్) వెర్షన్ల కంటే ముందు వెర్షన్ వాడుతున్నవారు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. క్రోమ్ పాత వెర్షన్ లో కొన్ని లోపాలు ఉన్నాయని, దాంతో హ్యాకర్లు ఎంతో సులభంగా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని సీఈఆర్టీ-ఎన్ వెల్లడించింది.
వెబ్ ఆర్టీపీ అండ్ గెస్ట్ వ్యూ, టైప్ కన్ఫ్యూజన్ ఎర్రర్, వెబ్ ట్రాన్స్ పోర్ట్ తదితర లోపాలను క్రోమ్ పాత వెర్షన్ లో గుర్తించామని తెలిపింది. ఈ లోపాలతో హ్యాకర్లు ప్రపంచంలో ఎక్కడ్నించైనా సరే కంప్యూటర్లను తమ అధీనంలోకి తీసుకునే వీలుందని పేర్కొంది. హ్యాకర్లు తాము రూపొందించిన వెబ్ పేజ్ ను క్రోమ్ లో ప్రవేశపెడతారని, దీనిపై యూజర్లు క్లిక్ చేస్తే వారి సమాచారం అంతా హ్యాకర్ల వశమవుతుందని వివరించింది.