Bhanuchandar: ఆ పాట వెనుక అంత కథ నడిచింది: హీరో భానుచందర్
- తన తండ్రి మాస్టర్ వేణు గురించిన ప్రస్తావన
- 'ఏరువాక సాగారో' పాట ప్రత్యేకత గురించి వెల్లడి
- వహీదా రెహమాన్ గురించి వివరణ
భానుచందర్ తండ్రి మాస్టర్ వేణు .. అప్పట్లో ఎన్నో సినిమాలకి ఆయన సంగీత దర్శకుడిగా ఉన్నారు. ఆయన నుంచి ఎన్నో మరపురాని పాటలు వచ్చాయి. అలాంటి పాటలలో 'రోజులు మారాయి' సినిమాలోని 'ఏరువాక సాగారో' పాట ఒకటి. తాజా ఇంటర్వ్యూలో ఆ పాటను గురించి భానుచందర్ ప్రస్తావించారు.
"నాన్నగారు ట్యూన్ చేసిన గొప్ప పాటల్లో ఇది ఒకటి. ఈ పాటను ఏడు భాషల్లో ఉపయోగించుకోవడం జరిగింది. బాలీవుడ్ నుంచి ఎస్.డి. బర్మన్ గారు నాన్నగారికి కాల్ చేసి, ఆయన అనుమతిని తీసుకుని హిందీలో ఆ పాటను వాడుకోవడం జరిగింది. ఆ సినిమాతోనే వహీదా రెహమాన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పాటలో ఆమె అద్భుతంగా డాన్స్ చేశారు" అని అన్నారు.
"వహిదా రెహమాన్ రాజమండ్రిలో పుట్టిపెరిగారు. ఈ సినిమా కోసం నాన్నగారు .. డైరెక్టర్ చాణక్య గారు ఆమెను పరిచయం చేశారు. ఈ సినిమాను చూసే గురుదత్ గారు మద్రాసుకి వచ్చి .. వహీదా రెహమాన్ ను బాలీవుడ్ సినిమా కోసం బుక్ చేయడం జరిగింది. అందువల్ల మేము ఎప్పుడు ముంబై వెళ్లినా వహీదా రెహమాన్ గారు మమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకునేవారు. ఈ పాటలో కీలకంగా అనిపించే డప్పు వాయించింది నాన్నగారే " అంటూ చెప్పుకొచ్చారు.