SI: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
- ప్రిలిమ్స్ పరీక్షలో 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయం
- ఇటీవల ఆందోళనలు చేపట్టిన అభ్యర్థులు
- హైకోర్టును ఆశ్రయించిన వైనం
తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ప్రిలిమ్స్ పరీక్షలో వివాదాస్పదమైన 7 ప్రశ్నల విషయంలో ఉదారంగా స్పందంచింది. ఆ ఏడు ప్రశ్నలకు మార్కులు కలపాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ ) తాజాగా నిర్ణయించింది.
ప్రిలిమ్స్ ప్రశ్నలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వారు ఆందోళనలు కూడా చేపట్టారు. బీజేవైఎం శ్రేణులు కూడా పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగింది.
కాగా, కొత్తగా 7 ప్రశ్నలకు మార్కులు జోడించిన నేపథ్యంలో, ఉత్తీర్ణత సాధించిన వారి జాబితాలను జనవరి 30న వెబ్ సైట్ లో ఉంచుతామని టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ తో వెబ్ సైట్ లోకి ప్రవేశించి, ఈ జాబితాలు చూసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.
ఉత్తీర్ణత సాధించినవార పార్ట్-2 దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అయితే ఇదివరకే పీఈటీ, పీఎంటీ టెస్టులో అర్హత పొందినవారు పార్ట్-2 దరఖాస్తు చేసుకోనవసరంలేదని వివరించింది. పార్ట్-2 దరఖాస్తులు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5 లోపు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.
మార్కులు కలపాలన్న ప్రభుత్వం నిర్ణయంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలన్న ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు, బీజేవైఎం కార్యకర్తల పోరాట ఫలితంగా సాధించిన విజయం అని పేర్కొన్నారు.