Nara Lokesh: పాడిరైతుల పేరుతో జగన్ వందల కోట్ల అవినీతికి తెరలేపాడు: లోకేశ్

Lokesh met dairy farmers in Padayatra
  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • నేడు మూడో రోజు
  • గుండిసెట్టిపల్లిలో పాడిరైతులతో లోకేశ్ సమావేశం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మూడో రోజు కొనసాగుతోంది. లోకేశ్ నేడు గుండిసెట్టిపల్లి లో పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో పశువులు కొనడానికి 50 శాతం సబ్సిడీ ఇచ్చారని, ఎస్సీలకు 70 శాతం సబ్సిడీ ఇచ్చారని వెల్లడించారు.  టీడీపీ హయాంలో సబ్సిడీతో దాణా, సైలేజ్ తక్కువ రేటుకి ఇచ్చేవారని తెలిపారు. 

కానీ, వైసీపీ పాలనలో సబ్సిడీలు లేవు, దాణా, సైలేజ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. లీటరుకు రూ.4 బోనస్ ఇస్తామని మోసం చేశారని లోకేశ్ మండిపడ్డారు. 

"పాడి రైతులకు ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ. పాల ధర తక్కువగా ఉంది, దాణా ఇతర ఖర్చులు ఎక్కువయ్యాయి. పశువులకు జబ్బు చేస్తే ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. పశువుల డాక్టర్ కి చూపించడానికే ఒక్కో పశువుకి వెయ్యి రూపాయిల వరకు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. టీడీపీ హయాంలో బెయిల్ గడ్డి రూ.180కి వస్తే, వైసీపీ పాలనలో సుమారుగా రూ.400 అయింది. గడ్డి కటింగ్ మెషీన్లు, పాలు పిండే మెషీన్లు సబ్సిడీ కి ఇవ్వాలి. 

చంద్రబాబు మొదటి నుండి పాడి రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఉంటే రైతులు ఆర్దికంగా బలంగా ఉంటారు అనే ఆలోచనతో చంద్రబాబు గారు పాడి రైతులను ఎక్కువగా ప్రోత్సహించారు. రెండు రూపాయిలకే కిలో సైలేజ్ టీడీపీ హయాంలో అందజేసాం. టీడీపీ హయాంలో మినరల్ మిక్చర్, సైలేజ్, చాపింగ్ మెషీన్లు సబ్సిడీకి ఇచ్చాం. 

జగన్ కి పాడి పరిశ్రమ మీద అవగాహన లేదు. సహకార సంఘాల డైరీలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. జగన్ రెడ్డి చిత్తూరు, ఒంగోలు డైరీలను అమూల్ కి కట్టబెట్టాడు. రూ.650 కోట్ల ఆస్తులు విలువున్న చిత్తూరు డైరీ ని అమూల్ కి కట్టబెట్టడం దారుణం. పాడి రైతుల పేరుతో 3 వేల కోట్లు అప్పు తీసుకొని అమూల్ కి కట్టబెడుతున్నారు. పాడి రైతుల పేరుతో జగన్ రెడ్డి వందల కోట్ల అవినీతికి తెరలేపాడు.

పెట్టుబడి తగ్గించి ఆదాయం పెరిగేలా టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రణాళిక సిద్ధం చేస్తాం. గోపాలమిత్రలకు జీతాలు ఇవ్వలేని దుస్థితి వైసీపీ పాలనలో ఉంది" అంటూ లోకేశ్ వివరించారు.
Nara Lokesh
Padayatra
Yuvagalam
Kuppam
TDP
Andhra Pradesh

More Telugu News