Fluorosis: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి

Amshala Swamy passed away today

  • ఫ్లోరోసిస్ విముక్తి పోరాటంలో కృషి చేసిన నల్లగొండ జిల్లాకు చెందిన స్వామి
  • ట్రై సైకిల్ నుంచి కింద పడి తలకు తీవ్ర గాయం
  • స్వామికి ఇల్లు కట్టించిన మంత్రి కేటీఆర్ 

నల్లగొండ జిల్లాకు చెందిన ఫ్లోరోసిస్ బాధితుడు, ఫ్లోరోసిస్ విముక్తి పోరాటంలో కృషి చేసిన అంశల స్వామి శనివారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ట్రై సైకిల్ నుంచి కింద పడి తలకు తీవ్ర గాయం అవ్వడంతో స్వామి మృతి చెందినట్టు తెలుస్తోంది. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడిగా స్వామి గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాలుగా ఈ విషయంపై గళమెత్తారు. స్వామి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

‘స్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఫ్లోరోసిస్ బాధితుల కోసం ఆయన పోరాటం చేసిన గొప్ప యోధుడు స్వామి. ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. ఆయన ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో స్వామి ఇబ్బందులను తెలుసుకున్న కేటీఆర్ ఆయనకు ఇల్లు కటించారు. జీవనోపాధి కోసం ఓ సెలూన్ కూడా ఏర్పాటు చేయించారు. కొన్ని నెలల కిందట అంశల స్వామి ఇంటికి వెళ్లారు. నేలపై కూర్చొని స్వామితో కలిసి భోజనం చేశారు. ఆ ఫొటోలను కేటీఆర్ ఇప్పుడు  ట్విట్టర్ లో షేర్ చేశారు.

More Telugu News