Imran Khan: జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- ప్లాన్-బి విఫలం కావడంతో ‘ప్లాన్-సి’ అమలు చేస్తున్నారన్న ఇమ్రాన్
- ఈ కుట్ర వెనక మాజీ అధ్యక్షుడు జర్దారీ హస్తం ఉందని ఆరోపణ
- తనను చంపేందుకు ఓ ఉగ్రసంస్థకు డబ్బులు ఇచ్చారన్న మాజీ ప్రధాని
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు మళ్లీ పథక రచన జరుగుతోందన్నారు. ఈసారి మాజీ అధ్యక్షుడు జర్దారీ కుట్ర పన్నారని అన్నారు. అందులో భాగంగా ఓ ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మును జర్దారీ తన హత్యకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
అంతేకాదు, గతంలో తన హత్యకు కుట్ర పన్నిన వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ఇమ్రాన్ అన్నారు. వజీరాబాద్‌లో తనపై ‘ప్లాన్-బి’ అమలు చేసి అంతమొందించాలని చూశారని, అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డానని గుర్తు చేశారు. ‘ప్లాన్-బి’ విఫలం కావడంతో ఇప్పుడు ‘ప్లాన్-సి’ అమలు చేస్తున్నారని అన్నారు. ఓ ఉగ్ర సంస్థకు పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చారన్నారు. ఈ కుట్రలో ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర కూడా ఉందని ఇమ్రాన్ ఆరోపించారు. కాగా, గతేడాది నవంబరు 3న ఇమ్రాన్‌పై జరిగిన దాడిలో ఆయన కుడికాలికి బుల్లెట్ గాయమైంది.