Republic Day: రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్న గవర్నర్

Grand Republic day celebrations at Raj Bhavan

  • రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
  • అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైందన్న గవర్నర్
  • కొత్త భవనాలు కట్టడం అభివృద్ధి కాదంటూ కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు
  • కొంతమందికి తాను నచ్చకపోవచ్చని వ్యాఖ్య

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి వేడుకలకు హాజరు  కాగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..  రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని ప్రశంసించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందన్న గవర్నర్.. వైద్యం, ఐటీ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ పూర్తి సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. 

పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదని.. నేషనల్ బిల్డింగ్‌ను అభివృద్ధి అంటారని గుర్తు చేశారు. ఫామ్ హౌస్‌లు కట్టడం, మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదని అన్నారు. రాష్ట్ర విద్యాలయాల్లోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలని అన్నారు. తెలంగాణతో తనకున్నది మూడేళ్ల అనుబంధం కాదని, పుట్టుకనుంచే ఉందని అన్నారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చు కానీ.. తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News