Jagityal: బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందంటూ.. జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి రాజీనామా 

Jagityal Muncipal Chairperson Sravani resigns

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు
  • అడుగడుగునా వేధింపులకు గురిచేశారని మండిపాటు
  • డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆవేదన

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు భరించలేకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనను సంజయ్ అడుగడుగునా వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. 'మీకు పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి, జాగ్రత్త' అని సంజయ్ బెదిరించారని... డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. ఒక బీసీ బిడ్డనైన తాను ఎదుగుతున్నానని దొర అహంకారంతో తనపై కక్షకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అభివృద్ధి పనులకు అడ్డుతగిలారని... మున్సిపల్ ఛైర్మన్ పదవి తనకు నరకప్రాయంగా మారేలా చేశారని చెప్పారు. 

ఎమ్మెల్యే పదవితో పోలిస్తే నీ పదవి ఎంత అని తనను అవమానించారని మండిపడ్డారు. చెప్పకుండా ఒక వార్డును సందర్శించినా ఆయన దృష్టిలో నేరమేనని చెప్పారు. తన చేతుల మీదుగా ఒక్క పని కూడా ప్రారంభం కాకుండా చేశారని అన్నారు. పేరుకే తాను మున్సిపల్ ఛైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదే అని దుయ్యబట్టారు. ఆయన ఇచ్చిన స్క్రిప్టునే తాను చదవాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్, కవిత పేరును ప్రస్తావించకూడదు, వారిని కలవకూడదని హుకుం జారీ చేశారని చెప్పారు. సంజయ్ కుమార్ తో తమ ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణమని అన్నారు. తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరుతున్నానని చెప్పారు.

Jagityal
Municipal Chairman
Sravani
BRS
MLA
  • Loading...

More Telugu News