Nara Lokesh: మా తాత ఎన్టీఆర్ కు చెడ్డపేరు మాత్రం తీసుకురాను: నారా లోకేశ్

Lokesh welcomes Kandru Srinivasarao and others into TDP

  • టీడీపీలో చేరిన కాండ్రు శ్రీనివాసరావు తదితరులు
  • పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేశ్
  • దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నేత ఎన్టీఆర్ అని కితాబు
  • టీడీపీలో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని వెల్లడి

మంగ‌ళ‌గిరి మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ కాండ్రు శ్రీనివాసరావు తో పాటు న్యాయ‌వాది కొమ్మారెడ్డి వీర‌రాఘ‌వ‌రెడ్డి, రిటైర్డ్ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు నూత‌ల‌పాటి నంబూద్రిపాద్, తిరువీధుల న‌ర‌సింహమూర్తి పార్టీలో చేరిన సంద‌ర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడారు. 

దేశానికి అభివృద్ధి, సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని న‌మ్మి తెలుగుదేశం పార్టీని ఆరంభించార‌న్నారు. మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు క‌ల్పించిన మ‌హానాయకుడు ఎన్టీఆర్ తెలుగుజాతి కీర్తి కిరీటం అని పేర్కొన్నారు. 

తెలుగువారిని మద్రాసీలు అనేవార‌ని, టీడీపీ ఆవిర్భావం తరువాత తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ కు వారసునిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో భాగస్వామిని కావ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. తాత ఎన్టీఆర్ అంత మంచి పేరు తెచ్చుకోలేకపోవచ్చు కానీ ఆయనకు చెడ్డపేరు మాత్రం తీసుకురాన‌ని లోకేశ్ ప్ర‌తిన‌బూనారు. 

జనవరి 27 నుంచి 400 రోజుల పాటు 4 వేల కిలో మీటర్లు యువగళం పేరుతో రాష్ట్రంలో పాదయాత్రకు వెళుతున్నాన‌న్నారు. ఈ సమయంలో మంగళగిరి ప్రజలకు మాత్రం కొంచెం దూరం అవుతాను అనే బాధ ఉన్నా... ప్ర‌జ‌లంద‌రినీ క‌లిసి వారి బాగోగులు తెలుసుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. నేను ఎక్కడ ఉన్నా నా మనసు మంగళగిరిపైనే ఉంటుంద‌ని, ఎవ‌రికి ఏ సాయం కావాల‌న్నా వారికి అందుతుంద‌ని భ‌రోసా ఇచ్చారు.  నన్ను ఆశీర్వదించండి... దీవించండి, వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండి, రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

More Telugu News