Chandrababu: ఎన్టీఆర్ బెస్ట్ క్రియేటర్ సీఎం అయితే, జగన్ అతి పెద్ద విధ్వంసక సీఎం: చంద్రబాబు

Chandrababu slams CM Jagan

  • నేడు ఎన్టీఆర్ 27వ వర్ధంతి
  • టీడీపీ కార్యాలయంలో కార్యక్రమం
  • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు

దివంగత నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి కార్యక్రమం నేడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రసంగిస్తూ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను వేనోళ్ల కొనియాడారు.

దేశంలో బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, బెస్ట్ క్రియేటర్ సీఎంలలో ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉంటారని అన్నారు. అయితే ఇప్పుడు అతి పెద్ద విధ్వంసకుడైన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డే అని చంద్రబాబు విమర్శించారు. ఎన్టీఆర్ నాడు సింగిల్ విండో విధానం, రెండు రూపాయలకే కేజీ బియ్యం వంటి పథకాలకు నాంది పలికారని వివరించారు. తెలుగు గంగ, ఎస్ఎల్ బీసీ, ఎస్ఆర్ బీసీ వంటి అనేక ఇరిగేషన్ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని వెల్లడించారు. 

"ఇరిగేషన్ కు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేది. 2014 నుంచి 2019 వరకు రూ.64 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం. 72 శాతం పూర్తి చేసిన పోలవరాన్ని నేటి ముఖ్యమంత్రి గోదావరిలో కలిపేశాడు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే... తరువాత కాలంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేలా నేను పనిచేశాను. 

నాడు ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం... ఇప్పుడు దేశంలో ఆహార భద్రత పథకం అయ్యింది. నాడు మహిళలకు ఇచ్చిన ఆస్థి హక్కు ఇప్పుడు దేశంలో చట్టం అయ్యింది. బడుగు వర్గాలకు దేశంలో తొలిసారి గురుకుల పాఠశాలలు పెట్టింది టీడీపీ. ఇప్పుడు అవే హాస్టల్స్ గా మారాయి. 

అయితే ఇప్పుడు స్కూళ్లకు రంగులు వేసిన ఈ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల విలీనం కారణంగా 4 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం అయ్యారు. ఎన్టీఆర్ మనకు గట్టిగా ప్రశ్నించే విధానాన్ని, చైతన్యాన్ని అందించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి. 

ఇప్పుడు మన పర్యటనలను అడ్డుకుంటున్న ప్రభుత్వాన్ని మనం అంతే గట్టిగా ప్రశ్నించాలి. మనం మీటింగ్ లు పెట్టుకుంటే ఎందుకు పోలీసుల భద్రత ఇవ్వడం లేదు? కందుకూరులో అంత మంది జనం వస్తే పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు...? ప్రభుత్వంపై వ్యతిరేకతతో జనం మన సభలకు తరలివస్తున్నారు. అయితే ఇప్పుడు జీవో నెంబర్ 1 తెచ్చి మనల్ని అడ్డుకుంటున్నారు. మనకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది... దాన్ని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? 

ఈ రోజు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పిలుపునిస్తున్నా... ప్రతి కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లోకి రావాలి. నాకెందుకు రాజకీయం అని ఎన్టీఆర్ నాడు అనుకుని ఉంటే ఏమయ్యేది...? ప్రజలు అంతా ఆలోచించాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీల సబ్ ప్లాన్ నిధులు ఏం చేస్తున్నారు...? వారి కోసం ఖర్చుచేయాల్సిన నిధులను మళ్లించారు. 

తిరుమలలో నాడు భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్... దానిని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెట్టాను. పేదలకు అన్నా క్యాంటీన్ పెట్టడం తప్పా...? పేద విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు కల్పిస్తే తప్పా...? ఇవన్నీ ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది...? సంక్షేమాన్ని పక్కన పెట్టి... ఈ ప్రభుత్వం బాదుడే బాదుడు అమలు చేస్తోంది. ప్రజలపై వీర బాదుడు బాదేస్తోంది. 

అవినీతిపై టీడీపీ కఠినంగా ఉండేది.... కానీ జగన్ వచ్చిన తరువాత అవినీతిని కేంద్రీకరణ చేశాడు. మద్యం, ఇసుక ఆదాయం అంతా జగన్ దగ్గరకే రావాలి. సాయంత్రం అయితే జగన్ అవినీతి సొమ్ము లెక్కించుకుంటున్నాడు. మద్యం అమ్మకాల్లో నీ సొంత బ్రాండ్లు ఎందుకు అని ప్రశ్నించాం... కానీ జగన్ మారలేదు. నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నా జగన్ రెడ్డికి పట్టడం లేదు. 

పుంగనూరులో రౌడీ రాజకీయం చేస్తున్నారు. వైసీపీ తప్పులను ప్రశ్నించిన టీడీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మొన్న జరిగిన ఘటనలో చదువుకుంటున్న విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. మైనారిటీ యువకులను జైల్లో తీవ్రంగా హింసించారు. దెబ్బలు కనపడకుండా కొట్టి టీడీపీ కార్యకర్తలను దారుణంగా హింసించారు. పోలీసులు ఇంత రాక్షసంగా వ్యవహరించడం ఎప్పుడూ చూడలేదు. తమ బిడ్డలపై జరిగిన హింసపై మైనారిటీ మహిళల బాధలు చూస్తే గుండె తరుక్కుపోయింది. 

ఎన్టీఆర్ నాడు భయపడి ఉంటే రాజకీయ పార్టీ పెట్టేవారు కాదు. ఆయనపైనా నాడు కేసులు పెట్టారు. అయినా ఎదిరించి నిలబడ్డారు. రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది. రాష్ట్రంలో రూ.500 నోట్లు కనిపించడం లేదు. ఆ నోట్లు అన్నీ జగన్ దాచేస్తున్నాడు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలి అని జగన్ చూస్తున్నాడు కానీ డబ్బుతో జగన్ కు ఓట్లు వేసే పరిస్థితి లేదు. 

ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరును తొలగించిన సీఎం... వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టాడు.  నాడు నేను అనుకుని ఉంటే కడపలో ఉన్న వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు తీసేసే వాడిని కదా. కానీ  మేము అలా వ్యవహరించలేదు. 

ప్రజా వేదిక కూల్చినప్పుడే  జగన్ ను ప్రజలు ప్రశ్నించి ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు. రేపు జరిగే ఎన్నికలు చాలా కీలకం....వచ్చే ఎన్నికల్లో జగన్ ఒక పక్క...5 కోట్ల ప్రజలు ఒక పక్క! ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అర్పించడం అంటే...ఆయన ఆశయ సాధనకు పనిచేయడమే" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News