Pawan Kalyan: ఈ నెల 24న కొండగట్టులో 'వారాహి' వాహనానికి పూజలు

Pawan Kalyan will perform special pooja to his Varahi vehicle

  • ఏపీలో పవన్ బస్సు యాత్ర
  • వారాహి పేరిట ప్రత్యేక వాహనం సిద్ధం
  • పవన్ ఇష్టదైవం ఆంజనేయస్వామి
  • ఈ నెల 24న కొండగట్టు రానున్న జనసేనాని

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీలో తలపెట్టిన బస్సు యాత్ర కోసం వారాహి పేరిట ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించుకోవడం తెలిసిందే. ఈ వాహనానికి ఈ నెల 24న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో పూజలు జరిపించనున్నారు. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేనాని పవన్ కల్యాణ్ జనవరి 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శిస్తారని, వారాహి వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని ఆయన నిర్ణయించారని ఆ ప్రకటనలో పేర్కొంది. 

2009లో ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరగ్గా, కొండగట్టు అంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్టు పవన్ కల్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారని వివరించింది. అందుకే తాను తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచే ప్రారంభించడాన్ని ఆయన శుభసూచకంగా భావిస్తారని ఆ ప్రకటనలో వెల్లడించింది.

"ఈ క్రమంలో... రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన వారాహిని ఇక్కడ నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ జనసేనకు చెందిన ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు" అని ఆ ప్రకటనలో జనసేన పార్టీ వివరించింది. 

అంతేకాదు, ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన)ను ప్రారంభించాలని పవన్ కల్యాణ్ సంకల్పించినట్టు తెలిపింది. ఇందులో భాగంగా తొలుత ధర్మపురిలోని శ్రీలక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారని, ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారని వెల్లడించింది.

  • Loading...

More Telugu News