Kesineni Nani: టీడీపీలో ప్రక్షాళన జరగాలి.... సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని
- ఎవరికి పడితే వారికి టికెట్లు ఇవ్వరాదన్న నాని
- ముగ్గురు నేతలకు టికెట్లు ఇస్తే పనిచేయనని వెల్లడి
- తన తమ్ముడికి ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వబోనని స్పష్టీకరణ
- మంచివాళ్లకు టికెట్ ఇస్తే గెలిపిస్తానని వ్యాఖ్యలు
టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ప్రక్షాళన జరగాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో 420, కాల్ మనీ వ్యాపారస్తులు కూడా భాగం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, చీటర్లకు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లకు, కబ్జాకోరులకు, ఉమనైజర్లకు మాత్రం టీడీపీ టికెట్లు ఇవ్వరాదని పేర్కొన్నారు.
గొప్ప ఆశయాలు, సిద్ధాంతాలతో ఏర్పడిన పార్టీ టీడీపీ అని ఉద్ఘాటించారు. ఎవరంటే వారికి టికెట్లు ఇచ్చి పార్టీ సైద్ధాంతిక బలాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. ఓ ముగ్గురు నేతలు ఉన్నారని, వారికి టికెట్ ఇస్తే కచ్చితంగా పనిచేయనని తేల్చి చెప్పారు.
తన తమ్ముడికి సీటు ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వనని కుండబద్దలు కొట్టారు. నా తమ్ముడు యాక్టివ్ గా ఉంటే మంచిదే... ఆయన వెంటే తిరగమనండి... నా వెంట ఎందుకు? అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు. మంచి వారికి టికెట్ ఇస్తే ఎంపీగా గెలిపించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
తనకు క్యారెక్టర్ ఉందని, రాజకీయాల్లో ఎవరినీ మోసం చేయడానికి రాలేదని అన్నారు. ఎంపీ అయితేనే తనకు ఈ స్థాయి రాలేదని, తనకు ఎప్పటినుంచో బ్రాండింగ్ ఉందని కేశినేని నాని స్పష్టం చేశారు. తన స్థాయి ఢిల్లీ వరకు ఉందని, తన సేవలు అవసరం అనుకుంటే పార్టీ వాడుకోవచ్చని సూచించారు.