Joshimath: జోషిమఠ్ ఒక్కటే కాదు... ఉత్తరాఖండ్ లో మరిన్ని పట్టణాలకు కుంగుబాటు ముప్పు

More places in Uttarakhand faces sinking risk

  • ఉత్తరాఖండ్ లో భూమిలోకి కుంగిపోతున్న పట్టణం
  • జోషిమఠ్ లో 12 రోజుల్లో 5.4 సెంమీ కుంగిన భూమి
  • ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్రం
  • ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్న నిపుణులు

ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ పట్టణం భూమిలోకి కుంగిపోతుండడం జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. ఇక్కడి భూమి 12 రోజుల వ్యవధిలో 5.4 సెంమీ కుంగిపోయినట్టు ఇస్రో ఛాయాచిత్రాలు కూడా చెబుతున్నాయి. జోషిమఠ్ లో అనేక భవనాల గోడల్లో పగుళ్లు చోటుచేసుకోవడం, భూమి బీటలు వారడం ఆందోళన కలిగించే పరిణామాలు. 

జోషిమఠ్ ఒక్కటే కాదని, ఉత్తరాఖండ్ లో అనేక గ్రామాలు, పట్టణాలు కుంగుబాటు అంచున నిలిచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై నైనిటాల్ లోని కుమావో యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ రాజీవ్ ఉపాధ్యాయ్ స్పందించారు. 

ఉత్తరాఖండ్ ఉత్తర భాగంలో హియాలయ పర్వత సానువుల వెంట ఉండే గ్రామాలు, పట్టణాలు ఇక్కడి బలహీన పర్యావరణం కారణంగా ఎంతో సున్నితత్వం సంతరించుకున్నాయని వివరించారు. కొండచరియలపై అనేక నిర్మాణాలు చేపడుతున్నారని, ఇప్పటికే సహజ ఒత్తిడి నెలకొన్న ఈ ప్రాంతంలో మానవ నిర్మిత కట్టడాలతో మరింత ఒత్తిడి ఏర్పడుతోందని తెలిపారు. 

ఇంకా ఈ ప్రాంతంలో మరిన్ని యాంత్రిక చర్యలు చేపడితే భూమి కదిలిపోయే ప్రమాదం ఉందని, ఈ ప్రాంతం మొత్తం క్షీణతకు గురవుతుందని హెచ్చరించారు. 

ఉత్తరాఖండ్ ప్రధానంగా పర్వతప్రాంతం. అయితే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు డ్యాములు, పవర్ ప్లాంట్లు, రోడ్లు, సైనిక స్థావరాలు నిర్మించడం వల్ల సహజ వాతావరణం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు దశాబ్దాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Joshimath
Uttarakhand
Sink
Villages
Towns

More Telugu News