Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు తుపాకి లైసెన్స్!
- గతేడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆమెకు మద్దతు పలికిన ఇద్దరి హత్య
- బెదిరింపుల నేపథ్యంలో గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు ఢిల్లీ పోలీసులు తుపాకి లైసెన్స్ మంజూరు చేశారు. తన ప్రాణాలకు హాని ఉందని, స్వీయ రక్షణ కోసం తుపాకి కావాలన్న నుపుర్ శర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు ఆమెకు ఈ లైసెన్స్ జారీ చేశారు. నుపుర్ శర్మ గతేడాది ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
దేశంలో ఆమెకు మద్దతుగా మాట్లాడినందుకు మహారాష్ట్రలోని అమరావతిలో ఓ ఫార్మసిస్ట్, ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్ హత్యకు గురయ్యారు. నుపుర్ శర్మను కూడా హతమారుస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె స్వీయ రక్షణ కోసం తుపాకి లైసెన్స్ కి విజ్ఞప్తి చేయగా పోలీసులు ఆమెకు లైసెన్స్ మంజూరు చేశారు. నుపుర్ వ్యాఖ్యలపై పలు దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది.