Dr Manik Saha: బాలుడికి డెంటల్ సర్జరీ చేసిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహ
- త్రిపుర మెడికల్ కళాశాలలో నేటి ఉదయం డెంటల్ సర్జరీ నిర్వహణ
- రాజకీయాల్లోకి రాకముందు అదే కళాశాలలో ప్రొఫెసర్ గా సేవలు
- చాలా గ్యాప్ తర్వాత సర్జరీ చేసినా ఇబ్బంది లేదన్న సీఎం మాణిక్ సాహ
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహ వైద్యుడిగా మారిపోయారు. హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజ్ లో పదేళ్ల బాలుడికి డెంటల్ సర్జరీ స్వయంగా చేశారు. మాణిక్ సాహ వృత్తి రీత్యా డెంటల్ వైద్యుడు కావడం గమనార్హం. ఈ శస్త్ర చికిత్సకు సంబంధించిన ఫొటోలను త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘‘నేను గతంలో పనిచేసిన త్రిపుర మెడికల్ కళాశాలలో.. పదేళ్ల అక్షిత్ ఘోష్ అనే బాలుడికి ఓరల్ సిస్టిక్ లెషన్ సర్జరీ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉంది. చాలా విరామం తర్వాత సర్జరీ చేసినా, ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. పేషెంట్ ఆరోగ్యం బాగుంది’’ అని మాణిక్ సాహ ట్వీట్ పెట్టారు. రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్ కళాశాలలో డాక్టర్ మాణిక్ సాహ ప్రొఫెసర్ గా వైద్య పాఠాలు బోధించేవారు.
ఉదయం 9 గంటలకు సర్జరీ రూమ్ కు వచ్చిన డాక్టర్ సాహ అరగంట తర్వాత నవ్వుతూ బయటకు వచ్చేశారు. ఆయనకు పలువురు వైద్యుల బృందం సర్జరీలో సాయపడింది. 2022 మేలో త్రిపుర సీఎంగా మాణిక్ సాహ అధికారం చేపట్టారు.