Mallikarjun Kharge: కొందరు గవర్నర్లు సిగ్గులేకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు: మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge fires on Governors

  • ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట గవర్నర్లను బీజేపీ కార్యకర్తలుగా వాడుకుంటోందన్న ఖర్గే 
  • గవర్నర్ల వ్యవస్థకు కళంకం తీసుకొచ్చేలా వ్యవహరిస్తోందని ఆరోపణ 
  • రాజ్యాంగానికి లోబడి గవర్నర్లు పని చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు  

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే రాష్ట్ర గవర్నర్లను తమ సొంత పార్టీ కార్యకర్తలుగా బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్.రవికి, స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రానికి తమిళగం అనే పదం సరిగ్గా సరిపోతుందని రవి ఇటీవల వ్యాఖ్యానించారు. 

దీనిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసన సభ శీతాకాల సమావేశాల తొలిరోజున సంప్రదాయం ప్రకారం ప్రసంగించిన గవర్నర్... రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలోని కొన్ని భాగాలను వదిలిపెట్టారు. దీంతో ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డుల్లో నమోదు చేయాలని సభలో స్టాలిన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో సభ నుంచి గవర్నర్ కోపంగా వెళ్లిపోయారు. 

ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ఖర్గే స్పందిస్తూ... ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను బీజేపీ కార్యకర్తలుగా వాడుకుంటోందని విమర్శించారు. గవర్నర్ల వ్యవస్థకు కళంకం తెచ్చేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని అన్నారు. కొందరు గవర్నర్లు నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగానికి లోబడి గవర్నర్లు పని చేయాలని, చట్టసభను అవమానించకూడదని అన్నారు. ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు.

  • Loading...

More Telugu News