Sajjala Ramakrishna Reddy: వీళ్ల తిప్పలు చూస్తుంటే జగన్ ఎంత బలవంతుడో అర్థమవుతుంది: సజ్జల

Sajjala comments on Chandrababu and Pawan meeting
  • హైదరాబాదులో నిన్న చంద్రబాబు, పవన్ సమావేశం
  • ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమోనన్న సజ్జల
  • బీజేపీని కూడా కలుపుకుంటారేమోనని వ్యాఖ్యలు
  • విలువలతో పోరాడలేక అడ్డదారిలో వస్తున్నారని విమర్శలు
  • అందరినీ జగన్ ఒకేసారి ఓడిస్తారని వెల్లడి 
హైదరాబాదులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు, పవన్ రహస్యంగా సమావేశమవుతూ, తమ బంధం సక్రమమే అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

బాబు ఆలోచలన్నీ తాను, తన కోటరీ బాగుపడాలన్న దానిచుట్టూనే తిరుగుతాయని, అవసరమైతే వేల ఎకరాలైనా ఎలా కబ్జా చేస్తాడో తెలుసని, వెన్నుపోటు తదితర అంశాలకు ఆయన చిహ్నం అన్న సంగతి ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని, అందరికీ తెలిసిందేనని అన్నారు. చెప్పుకోవాల్సి వస్తే పవన్ కల్యాణ్ లాంటి వారి గురించి చెప్పకోవాలని వివరించారు. 

ఇది ఎప్పుడో జరగాల్సిన భేటీ అని, జనసేన, టీడీపీ కలవడం శుభ పరిణామం అని సీపీఐ కార్యదర్శి అంటున్నాడని సజ్జల వెల్లడించారు. వీరితో బీజేపీ కూడా కలిస్తే ఆయన ఏమంటాడో తెలియదు... ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో అంటూ సజ్జల వ్యంగ్యం ప్రదర్శించారు. 

సిద్ధాంతాలతో కానీ, ప్రజల మీద ప్రేమతో కానీ, విలువలతో కానీ పోరాడలేక ఇలా అడ్డదారిలో వస్తున్న వీళ్ల తిప్పలు చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ఎంతో బలవంతుడన్న విషయం తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇది అహంకారంతో చెబుతున్న మాట కాదని, ప్రజాస్వామ్యంలో బలం అంటే ప్రజల అండ, ప్రజల దీవెనలేనని సజ్జల స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. 

రాజకీయాల్లో ఉండి ఏం సాధించాలన్న దానిపై స్పష్టత ఉండాలే తప్ప, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేశాను, మరెన్నో ఏళ్లు విపక్షనేతగా చేశానని చెప్పుకుంటే ఉపయోగం లేదని అన్నారు. చంద్రబాబు గానీ, పవన్ గానీ పగటివేషాలు వేసినా... ఇకపై మరింతమందిని కలుపుకున్నా.... గుంటనక్కలు, పందికొక్కులు, ఎలుకలు అన్నీ కలిసి వచ్చినా ప్రజాబలం ఉన్న జగన్ ముందు భంగపాటు తప్పదు అని ఉద్ఘాటించారు. చేస్తే ప్రజాసేవ చేయాలే తప్ప వేరే మార్గంలో వెళ్లకూడదు అని వీరికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. 

కొందరు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాదయాత్రలకు సిద్ధమవుతున్నారని, పాదయాత్రతో జనంలోకి వెళ్లగానే వారి దీవెనలు లభిస్తాయనే భ్రమలో ఉన్నారని, లేదా, ప్రజలను భ్రమలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల విమర్శించారు. అలాంటి వారికి కనువిప్పు కలిగేలా సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాదయాత్ర చేసినా, ఇంకేదైనా చేసినా చిత్తశుద్ధి, నిజాయతీ అనేవి ఉండాలని స్పష్టం చేశారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Pawan Kalyan
YS Jagan
YSRCP
TDP
Janasena

More Telugu News