Kala Venkata Rao: జగన్ సర్కారు వరుస ఛార్జీల పెంపుతో భక్తులను స్వామివారికి దూరం చేస్తోంది: కళా వెంకట్రావు

Kala Venkatrao fires on YCP govt

  • తిరుమల కొండపై వసతి గృహాల అద్దె పెంపు
  • ఇది దురుద్దేశపూరితమన్న కళా వెంకట్రావు
  • టీటీడీ భక్తులకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శలు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన వసతి గృహాల రేట్లను భారీగా పెంచి భక్తులపై మరింత అధిక భారం మోపడం దురుద్దేశపూరితం అని విమర్శించారు. 

మొన్న లడ్డూ రేట్లు పెంచారు, నిన్న బస్ చార్జీలు పెంచారు... నేడు వసతి రేట్లు పెంచి తిరుమల వెంకన్నను భక్తులకు దూరంచేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.50 నుంచి రూ.200 ఉండే అద్దె గదుల రేట్లను రూ.750 నుంచి రూ.2,300కు పైగా పెంచటం దుర్మార్గం అని పేర్కొన్నారు. భగవంతుడ్ని భక్తులను దూరంచేయడానికి గత మూడేళ్లుగా కొనసాగుతున్న చర్యల్లో భాగమే అద్దెగదుల రేట్ల పెంపు అని కళా వెంకట్రావు ఆరోపించారు. 

"ఇలాంటి చర్యల వల్ల తిరుమల బాలాజీని దర్శించుకునే కోట్లాది భక్తుల మనసుల్లో అపోహలు, అనుమానాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం వేలాది కోట్ల రూపాయల ఆదాయం, ఆస్తులను కలిగిస్తున్న భక్తులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ దానికి విరుద్ధంగా వసతి గృహాలను భక్తులకు అందుబాటులో లేని విధంగా చేయటం దుర్మార్గం. 

గత మూడున్నరేళ్లుగా బాదుడే బాదుడు అంటూ పన్నులు పెంచి ప్రజలపై మోయలేని భారాలను మోపిన  జగన్ రెడ్డి ప్రభుత్వం... ఇప్పుడు తిరుమలను కూడా వ్యాపార సంస్థగా మార్చి భగవంతుడ్ని భక్తులకు దూరం చేస్తోంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పెంచిన అద్దె గదుల రేట్లను తిరుపతి తిరుమల దేవస్థానం వెంటనే విరమించుకోవాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది" అంటూ కళా వెంకట్రావు పేర్కొన్నారు.

Kala Venkata Rao
Jagan
Tirumala
TTD
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News