Sania Mirza: సానియా మీర్జా కెరీర్ కు ముగింపు వచ్చే నెలలోనే
- దుబాయి డబ్ల్యూటీఏ తర్వాత రిటైర్మెంట్
- స్వయంగా ప్రకటించిన సానియా మీర్జా
- ఇకపై కొనసాగేంత శక్తి లేదని వెల్లడి
టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ సానియా మీర్జా ఎట్టకేలకు తన కెరీర్ కు గుడ్ బై చెప్పబోతోంది. గత ఏడాది కాలంగా సానియా కెరీర్ ముగింపుపై సందిగ్ధత నెలకొనగా, స్వయంగా ఆమెనే దీనిపై స్పష్టత ఇచ్చింది. దుబాయిలో వచ్చే నెలలో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నమెంట్ తర్వాత తన కెరీర్ కు ముగింపు చెప్పనున్నట్టు సానియా మీర్జా ప్రకటించింది. ఓ వెబ్ సైట్ తో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.
‘‘డబ్ల్యూటీఏ ఫైనల్స్ తర్వాత నా కెరీర్ ను ముగించబోతున్నాను. ఎందుకంటే యూఎస్ ఓపెన్ ముందు నేను గాయపడ్డాను. దాంతో బయటకు రావాల్సి వచ్చింది. నాకు నచ్చినట్టుగా చేసే వ్యక్తిని. గాయం కారణంగా బలవంతంగా తప్పుకోవాల్సిన పరిస్థితి వద్దు. నా వయసు 36 ఏళ్లు. ఇక ముందు కెరీర్ లో కొనసాగేందుకు వీలుగా భావోద్వేగాలను నియంత్రించుకునేంత శక్తి లేదు’’ అని సానియా మీర్జా తెలిపింది.
నిజానికి సరిగ్గా ఏడాది క్రితం కూడా తన కెరీర్ కు ముగింపు పలకబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. టెన్నిస్ ఆడటం కోసం తన మూడేళ్ల కుమారుడితో కలిసి సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తోందని... చిన్నారిని ఇబ్బంది పెట్టలేనని సానియా తెలిపింది. తన శరీరం కూడా ఇంతకు ముందులా సహకరించడం లేదని చెప్పింది. ఎందుకోగానీ ఆ తర్వాత కూడా కెరీర్ ను కొనసాగించింది.