- ఎన్నో పరిశోధనల్లో వెల్లడైన విషయం ఇది
- రోజువారీగా రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం మంచిది
- రక్తపోటు నివారణలోనూ సాయం
- తాజా కంటే నిల్వ ఉన్నవాటితో ఎక్కువ ఫలితం
వెల్లుల్లి తింటే ఎంతో మంచిదని వింటుంటాం. నిజమే వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకునే వారికి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని, రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గార్లిక్ సప్లిమెంట్లకు బదులు నేరుగా వెల్లుల్లిని తినడమే మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే, వెల్లుల్లిని ఏ రూపంలో తీసుకుంటున్నాం? అనేది ఫలితాలను నిర్ణయిస్తుంది.
మన రక్తంలో లోడెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్డీఎల్), హై డెన్సిటీ లిపో ప్రొటీన్ (హెచ్ డీఎల్) అని రెండు రకాలు ఉంటాయి. ఇందులో ఎల్డీఎల్ తక్కువగా ఉండి, హెచ్ డీఎల్ ఎక్కువగా ఉండే వారికి గుండె జబ్బుల రిస్క్ ఉండదు. కానీ, ఎల్డీఎల్ ఎక్కువగా ఉండి, హెచ్ డీఎల్ తక్కువగా ఉండే వారికి రిస్క్ ఎక్కువ. తీసుకునే ఆహారంతోపాటు, జీవనశైలి ఎల్డీఎల్ శాతాన్ని నిర్ణయిస్తుంది.
వెల్లుల్లి ప్రభావం కొలెస్ట్రాల్ పై తక్కువే అని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే, మెజారిటీ పరిశోధనలు మాత్రం వెల్లుల్లికి కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి ఉందని చెబుతున్నాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయనం ఉంటుంది. తింటే ఘాటుగా ఉండడానికి, ఘాటైన వాసనకు ఇదే కారణం. రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి ఈ రసాయనానికి ఉంటుంది. వెల్లుల్లి రకాన్ని బట్టి కూడా అల్లిసిన్ పరిమాణంలో తేడాలుంటాయి.
తాజా వెల్లుల్లి కంటే కూడా నిల్వ ఉన్న వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, రక్తపోటును అదుపు చేయడంలో మంచి ప్రభావం చూపిస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. వెల్లుల్లుని ఎక్కువగా తీసుకుంటే కొందరిలో కొన్ని దుష్ప్రభావాలు కనిపించొచ్చు. కడుపు ఉబ్బరం, తేన్పులు, కడుపులో నొప్పి, నోటి నుంచి దుర్వాసన వస్తాయి. మీడియం సైజు పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని రోజూ తీసుకోవచ్చు. అది కూడా భోజనంలో మొదటి ముద్దలో భాగంగా తినాలి. కూరల్లో వేస్తే రుచి వస్తుందే కానీ, అందులోని రసాయనాల ప్రభావం క్షీణిస్తుంది.
పోషకాలు
ఒక వెల్లుల్లి రెబ్బలో రోజువారీ కావాల్సిన మాంగనీస్ 2 శాతం, విటమిన్ బీ6 2 శాతం, విటమిన్ సీ 1 శాతం, సిలీనియం 1 శాతం, ఫైబర్ 0.06 గ్రాములు ఉంటుంది. 4.5 కేలరీలు, 0.2 గ్రాముల ప్రొటీన్, ఇక గ్రాము కార్బోహైడ్రేట్ శరీరానికి అందుతాయి.