Ravela Kishore Babu: ప్రాణం పోయేంత వరకు కేసీఆర్ తోనే.. ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉంది: రావెల కిశోర్ బాబు
- ఈరోజు బీఆర్ఎస్ లో చేరనున్న రావెల
- కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతోందని వ్యాఖ్య
- మూడు రాజధానుల నిర్మాణం చరిత్రలో ఎక్కడా లేదని విమర్శ
ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సంగతి తెలిసిందే. రిటైర్ట్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ పార్థసారథిలతో కలిసి కేసీఆర్ సమక్షంలో వీరు గులాబీ జెండా కప్పుకోబోతున్నారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని చెప్పారు. కేసీఆర్ కార్యక్రమాలు తమను ఎంతో ఆకర్షించాయని అన్నారు. ఏపీలో పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని విమర్శించారు. టీడీపీ, వైసీపీల ఆధిపత్య పోరులో రాష్ట్రం నాశనమవుతోందని చెప్పారు.
మూడు రాజధానుల నిర్మాణం అనేది చరిత్రలో ఎక్కడా లేదని రావెల విమర్శించారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ ను నిర్మిస్తామని చెప్పారు. తాను, తోట చంద్రశేఖర్ మంచి స్నేహితులమని... ఇద్దరం కలిగి గతంలో ఒకే పార్టీలో పని చేశామని, ఇకపై కూడా కలిసే పనిచేస్తామని అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసినట్టే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తోందని... సీబీఐ, ఈడీ, ఐటీలను విపక్ష పార్టీలపై ప్రయోగిస్తూ, వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ప్రజలు బుద్ధి చెపుతారని న్నారు. తన చివరి శ్వాస వరకు తాను కేసీఆర్ తోనే ఉంటానని చెప్పారు.