Mahesh Babu: సామాజిక సేవా కార్యక్రమాల కోసం మహేశ్ బాబు కొత్త వెబ్ సైట్

Mahesh Babu starts new website for his charities
  • సామాజిక సేవ కోసం పాటుపడుతున్న మహేశ్ బాబు
  • రెండు గ్రామాల దత్తత
  • వందలాది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు
  • మహేశ్ బాబు ఫౌండేషన్ పేరిట వెబ్ సైట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ హీరో మాత్రమే కాదు మనసున్న మారాజు కూడా. ఆయన సేవా కార్యక్రమాల పరిధి మరింత విస్తరించింది. సొంతూరు బుర్రిపాలెంతోపాటు తెలంగాణలోని సిద్ధాపూర్ గ్రామాన్ని కూడా మహేశ్ బాబు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. 

ముఖ్యంగా, మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో వందలాది చిన్నారులకు హృద్రోగ సంబంధిత ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన సేవా కార్యక్రమాల కోసం కొత్త వెబ్ సైట్ ప్రారంభించారు. 

మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్ పేరుతో ఈ వెబ్ సైట్ ను తీసుకువచ్చారు. పిల్లల కోసం నూతన సంవత్సరాది రోజున ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తున్నట్టు మహేశ్ బాబు ఫౌండేషన్ ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ ట్వీట్ తో పాటు జోడించిన వీడియోలో మహేశ్ బాబు ముద్దుల తనయ సితార తన సందేశాన్ని వెలువరించింది. ఈ నెల తన పాకెట్ మనీని మహేశ్ బాబు ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తున్నానని, మీరు కూడా మీ వంతు సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మనందరం కలిసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని పేర్కొంది.
Mahesh Babu
Maheshbabu Foundation
Website
Charity
Tollywood

More Telugu News