Bairi Naresh: అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్

Police arrests Bairi Naresh

  • బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యల వీడియో వైరల్
  • నరేశ్ కు దేహశుద్ధి చేసిన అయ్యప్పమాలధారులు
  • పరారీలో ఉన్న బైరి నరేశ్
  • ఖమ్మం నుంచి వరంగల్ వెళుతుండగా అరెస్ట్

భారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేశ్ ఇటీవల అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అతడి వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో అయ్యప్పమాలధారులు అతడికి దేహశుద్ధి చేసినట్టు కూడా తెలిసింది. నరేశ్ వ్యాఖ్యలకు నిరసనగా అయ్యప్పదీక్షధారులు ఆందోళనలు చేపట్టారు. 

ఈ నేపథ్యంలో నరేశ్ ను వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నరేశ్ ను అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

నరేశ్ ఇటీవల తాను రావులపల్లిలో చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. పరారీలో ఉన్న సమయంలో ఈ వీడియోలు పోస్టు చేసినట్టు భావిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నరేశ్ ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఖమ్మం నుంచి వరంగల్ వెళుతుండగా అతడిని అరెస్ట్ చేశారు. 

ఈ పరిణామాలపై వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పందిస్తూ, బైరి నరేశ్ ను అరెస్ట్ చేశామని, అయ్యప్పస్వాములు ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. 

అటు, అయ్యప్పస్వామిపై బైరి నరేశ్ వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మతవిద్వేషాలు రెచ్చగొడితే తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఎవరినీ కూడా ఉపేక్షించేది లేదని, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

Bairi Naresh
Arrest
Police
Ayyappa Swamy
Vikarabad District
  • Loading...

More Telugu News