flight: తీవ్ర పొగమంచుతో ఢిల్లీలో 100 విమానాలకు అంతరాయం
- బుధవారం ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొంగమంచు
- వీటికి తోడు తీవ్రమైన చలిగాలులతో ప్రజల ఇబ్బంది
- వెలుతురు మందగించడంతో విమానాల రాకపోకలకు ఇబ్బంది
ఉత్తరాదిలో తీవ్రమైన పొగమంచు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చల్లటి గాలులతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడం, తీవ్ర చలిగాలులు వీయడంతో దాదాపు 100 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను సమీప ఎయిర్ పోర్టులకు మళ్లించినట్టు అధికారులు చెబుతున్నారు. సంవత్సరాంతపు సెలవుల సీజన్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీని పరిష్కరిస్తున్నప్పటికీ, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమాన ప్రయాణికుల సమస్యలు మరోసారి పెరిగాయి.
గత కొన్ని రోజులుగా దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో తరచూ వెలుతురు మందగిస్తోంది. దీనివల్ల బుధవారం మరోసారి విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోని సమాచారం ప్రకారం 18కి పైగా విమానాలు మధ్యాహ్నం వరకు ఆలస్యం అయ్యాయి. వీటిలో చాలా వరకు ఢిల్లీ నుంచి ఉత్తర భారత నగరాలకు వెళ్లాయి. పొగమంచు కారణంగా వెలుతురు తగ్గడంతో మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయంలో దాదాపు ఆరు గంటల పాటు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. ఈ అంతరాయంతో వందలాది మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. మంగళవారం విస్తారా, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు విమానాల ఆలస్యం, దారి మళ్లింపులపై విచారం వ్యక్తం చేశాయి.