GVL Narasimha Rao: ఉన్న వాళ్లను తరిమేయాలన్న ఆలోచన తప్ప మరోటి ఉందా?: జీవీఎల్

GVL Questions YS Jagan On AP IT

  • రాష్ట్రంలో ఐటీ రంగం కుదేలైందన్న జీవీఎల్
  • టీడీపీ, వైసీపీ నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుందన్న జీవీఎల్
  • 2024లో ఓడిపోయినా జగన్ అమరావతిలోనే ఉంటారా? అని ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేయడం తప్ప కొత్త కంపెనీలను తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అని జగన్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐటీ రంగం కుదేలైందని అన్నారు. 

ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 0.1 శాతంగా ఉందని, ఐటీ ఉత్పత్తుల్లో రాష్ట్రం ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఉన్న వాళ్లను తరిమేయడం తప్ప కొత్త కంపెనీలను తెచ్చి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఎందుకు చేయడం లేదని నిలదీశారు. టీడీపీ, వైసీపీ నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుందని, లేదంటే హైదరాబాద్ గుర్తొస్తుందని విమర్శించారు. 

ముఖ్యమంత్రి జగన్ నిన్న మాట్లాడుతూ.. తన పేరు జగన్ అని, తాను ఇక్కడే ఉంటానని డైలాగులు చెప్పారని, గతంలో అమరావతి విషయంలోనూ అదే చెప్పారని గుర్తు చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందన్న మాటకు కట్టుబడి లేరని, మరి ఈ మాటకు గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. 2024లో జగన్ ఓడిపోవడం ఖాయమని, అప్పుడు కూడా అమరావతిలోనే ఉంటారా? అని నిలదీశారు. దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

GVL Narasimha Rao
YS Jagan
Amaravati
Chandrababu
BJP
  • Loading...

More Telugu News