girl kidnap: సికింద్రాబాద్ పాప కిడ్నాప్ కథ సుఖాంతం

A Child Who Was Kidnapped In Secunderabad Police Handed Over To Parents Safely

  • శుక్రవారం సిటీలో కలకలం రేపిన ఆరేళ్ల పాప కిడ్నాప్
  • ఇంటిముందు ఆడుకుంటూ ఉన్న కృతిక మాయం  
  • సిద్దిపేటలో కిడ్నాపర్ ను పట్టుకుని పాపను కాపాడిన పోలీసులు  

సికింద్రాబాద్ లో ఆరేళ్ల పాప కిడ్నాప్ ఉదంతం చివరకు సుఖాంతం అయింది. పాప కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఐదు గంటల్లోనే పాప ఆచూకీని కనిపెట్టారు. పాపను క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పాపను అపహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

చిలకలగూడలో ఉండే నర్సింగ్, రేణుక దంపతులు సికింద్రాబాద్ లోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో పనిచేస్తున్నారు. ఈ దంపతుల కూతురు కృతిక స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. శుక్రవారం జనరల్ బజార్ లోని తన తల్లి ఇంట్లో కూతురును వదిలి రేణుక డ్యూటీకి వెళ్లింది. ఇంటిముందు ఆడుకుంటూ ఉన్న కృతిక కాసేపటికి కనిపించకుండా పోయింది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న రేణుక, నర్సింగ్.. కూతురు ఆ చుట్టుపక్కల అంతా వెతికారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతో పాటు స్థానిక ఆటో డ్రైవర్లను విచారించారు. దీంతో పాపతో కలిసి ఓ యువకుడు జేబీఎస్ కు వెళ్లాడని తేలింది. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. సిద్ధిపేట బస్ ఎక్కినట్లు బయటపడింది. చివరకు ధూళిమిట్టలో కృతికతో పాటు కిడ్నాపర్ ను గుర్తించి, ఆమెను కాపాడారు. కిడ్నాపర్ ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కు పాల్పడిన యువకుడిని ధూళికట్ట గ్రామానికి చెందిన రాముగా గుర్తించారు. దాదాపు 5 గంటల తర్వాత కృతికను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కిడ్నాపర్ రామును అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News