RJD: ఇండియాలో పరిస్థితి బాగోలేదు.. విదేశాల్లో సెటిలైపోవాలని మా పిల్లలకు చెప్పా: ఆర్జేడీ సీనియర్ నేత సిద్దిఖీ
- వీలైతే అక్కడే పౌరసత్వం తీసుకోవడానికి యత్నించాలని చెప్పానన్న సిద్దిఖీ
- ఇక్కడ జరుగుతున్నవి భరించలేరని చెప్పానని వెల్లడి
- ఇక్కడ అంత కష్టంగా ఉంటే పాకిస్థాన్ కు వెళ్లిపోవాలన్న బీజేపీ
ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారీ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలో ముస్లింలపై వివక్ష ఉందని ఆయన పరోక్షంగా అన్నారు. తన కొడుకు హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నాడని, కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డిగ్రీ చేసిందని ఆయన చెప్పారు.
విదేశాల్లోనే ఉద్యోగాలు చూసుకోవాలని... వీలైతే అక్కడే పౌరసత్వం వచ్చేలా ప్రయత్నించాలని వారికి తాను చెప్పానని తెలిపారు. తన మాటలకు వారు ఆశ్చర్యపోయారని, తాను చెప్పింది విశ్వసించలేకపోయారని చెప్పారు. తాను ఇప్పటికీ భారత్ లో నివసిస్తున్నానని, ఇక్కడ జరుగుతున్నవి మీరు భరించలేరని వారికి తాను చెప్పానని అన్నారు.
మరోవైపు సిద్దిఖీ వ్యాఖ్యలపై బీజేపీ బీహార్ యూనిట్ మండిపడింది. సిద్దిఖీ వ్యాఖ్యలు ముమ్మాటికీ దేశ వ్యతిరేకమైనవని అన్నారు. ఆయనకు ఇక్కడ అంత బాధ ఉంటే ఇక్కడ అనుభవిస్తున్నవన్నీ వదిలేసి, పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని సలహా ఇచ్చారు.