Andhra Pradesh: మూడున్నరేళ్లో ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేడు: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
- పీఆర్సీ శాస్త్రీయమైన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం చేసిందన్న సూర్యనారాయణ
- 20వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు, పింఛన్లను జమ చేస్తున్నారని మండిపాటు
- రానున్న రోజుల్లో పోరాటాలు చేస్తామని వెల్లడి
ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలు చేయడంలో శాస్త్రీయమైన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం చేసిందని విమర్శించారు. ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను తాము నమ్ముతున్నామని... అయితే, 20వ తేదీ వచ్చినా జీతాలు, పింఛన్లకు ఇంకా జమ చేస్తూనే ఉన్నారని, దీన్ని చూస్తుంటే ప్రభుత్వం ఉద్దేశపూర్యకంగానే చెల్లింపులు చేయకుండా ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోందని తాము భావించాల్సి ఉంటుందని చెప్పారు.
గత మూడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేరని సూర్యనారాయణ అన్నారు. వన్ మ్యాన్ షో చేసే అధికారి చేతిలో రాష్ట్ర భవిష్యత్తును ఉంచడం సరికాదని అన్నారు. వైద్యం, విద్య తన రెండు కళ్లని చెప్పుకునే ముఖ్యమంత్రి... ఆ శాఖల ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో పోరాటాలు చేయాలని తీర్మానించుకున్నామని తెలిపారు.